Komatireddy Venkat Reddy: కమీషన్ల పేరుతో మీ నాయకులు చేస్తున్న దోపిడీపై చర్యలు తీసుకోండి: కేసీఆర్ కు కోమటిరెడ్డి  లేఖ

Komatireddy Venkat Reddy wrote CM KCR

  • దళిత బంధు, బీసీ బంధు పథకాల్లో అవినీతి జరుగుతోందన్న కోమటిరెడ్డి
  • అధికార పార్టీకి చెందినవారికే లబ్ది చేకూరుతోందని వెల్లడి
  • ఈ వసూళ్లు ఎవరికి అందుతున్నాయో తేల్చాలన్న కాంగ్రెస్ ఎంపీ

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందని ఆరోపించారు. దళిత బంధు, బీసీ బంధు పథకాల్లో కమీషన్ల పేరుతో బీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా దోపిడీ సాగిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి సీఎం కేసీఆర్ ను కోరారు. 

అధికార పార్టీకి చెందినవారికే దళిత బంధు, బీసీ బంధు అందిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచిలు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులకే దళిత బంధు ఇస్తున్నారని కోమటిరెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో దళితబంధు లబ్దిదారుల జాబితా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని పేర్కొన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో 566 దళిత కుటుంబాలకు గాను 12 మందికి దళిత బంధు ఇస్తే, అది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్లకే ఇచ్చారని వివరించారు. 

తుంగతుర్తి నియోజకవర్గంలో మరీ దారుణంగా 30 శాతం కమీషన్ తీసుకుని దళిత బంధు, బీసీ బంధు యూనిట్లు మంజూరు చేశారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వసూళ్లు ఎటు వెళుతున్నాయో, ఎవరికి చేరుతున్నాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

"అవినీతికి పాల్పడితే కన్నబిడ్డ అని కూడా చూడను అని మీరు చెబుతుంటారు. ఇప్పుడు నా వద్ద ఉన్న వివరాలు మీకు అందిస్తాను. అవినీతిపరులపై చర్యలు తీసుకోండి. మేం కూడా దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తాం. మీకు ప్రజల్లో మంచి పేరు ఉంది. కానీ ఈ కమీషన్ల వ్యవహారంతో చెడ్డపేరు వస్తుంది. దీనిపై త్వరగా స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయండి... లేకపోతే ప్రజాక్షేత్రంలో ఎండగడతాం" అంటూ కోమటిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

Komatireddy Venkat Reddy
KCR
Dalit Bandhu
BC Bandhu
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News