nandamuri chaitanya krishna: చంద్రబాబు అరెస్ట్: జగన్ ప్రభుత్వంపై నందమూరి చైతన్యకృష్ణ ఆగ్రహం

Nandamuri Chaitanya Krishna fires at YS Jagan Government
  • నీతి, న్యాయం, ధర్మం ఓడిపోయాయన్న చైతన్యకృష్ణ
  • చంద్రబాబును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య
  • దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేశారని ఆగ్రహం
  • జగన్ ప్రభుత్వానికి చమరగీతం పాడుదామని పిలుపునిచ్చిన చైతన్యకృష్ణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌తో నిన్న ఓడిపోయింది కేవలం ఆయనే కాదని, నీతి, న్యాయం, నిజాయతీ, ధర్మం ఓడిపోయాయని, అవినీతి మాత్రం గెలిచిందని నందమూరి జయకృష్ణ తనయుడు నందమూరి చైతన్యకృష్ణ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి, ఆయనను జైలుపాలు చేసిందన్నారు. చంద్రబాబును అన్యాయంగా జైల్లో వేశారన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి ఉండాలని, కానీ నిబంధనలు పాటించకుండానే అరెస్ట్ చేశారన్నారు. కనీసం ఎఫ్ఐఆర్‌లో కూడా టీడీపీ అధినేత పేరు లేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆయనను ఎలా అరెస్ట్ చేశారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం అధైర్యపడవద్దన్నారు. నేను చైతన్యకృష్ణను, బాబాయ్ బాలకృష్ణ, లోకేశ్.. మేమంతా అండగా నిలబడతామన్నారు. ఈ అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతామని, చంద్రబాబును కాపాడుకుంటామన్నారు. లక్ష కోట్లు తిన్నవాడు బయట తిరుగుతున్నాడని, ఒక్క రూపాయి కూడా తిననివాడు జైల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సిగ్గులేని ప్రభుత్వమన్నారు.
nandamuri chaitanya krishna
Chandrababu
Andhra Pradesh

More Telugu News