Aisa Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ నేడు కూడా ఆగిపోతే ఏం జరుగుతుంది.. భారత్ ఫైనల్ చేరుకుంటుందా?
- నిన్న వర్షం కారణంగా నిలిచిపోయిన మ్యాచ్
- అప్పటికి భారత్ స్కోరు 24.1 ఓవర్లలో 147/2
- నేటి మ్యాచ్ కూడా రద్దయితే భారత్‌కు కష్టాలే
- నేడు పాక్‌పై గెలిచి, మిగతా రెండు మ్యాచుల్లో ఒక్కదాంట్లో గెలిచినా అవకాశాలు పుష్కలం
ఆసియాకప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాడు. గ్రూప్ దశలో తొలి మ్యాచ్‌ను తుడిచిపెట్టేసిన వరుణుడు.. గత రాత్రి జరగాల్సిన సూపర్-4 మ్యాచ్‌పైనా నీళ్లు చల్లాడు. అయితే, ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిన్న మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్‌శర్మ (56), శుభమన్‌గిల్ (58) అర్ధ సెంచరీలు చేసి అవుటయ్యారు. విరాట్ కోహ్లీ (8), కేఎల్ రాహుల్ (17) క్రీజులో ఉన్నారు.
నేడు రిజర్వు డే కావడంతో నిన్న ఆగిపోయిన దగ్గరి నుంచి మ్యాచ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నేడు కూడా వర్షం కురిసి ఆట కొనసాగకపోతే ఏమవుతుందన్న ప్రశ్న సగటు క్రికెట్ అభిమానులను వేధిస్తోంది. సూపర్-4లో ప్రస్తుతం పాకిస్థాన్, శ్రీలంక జట్లు చెరో రెండు పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నెట్ రన్‌రేట్‌లో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు ( 1.051) శ్రీలంక ( 0.420) కంటే మెరుగ్గా ఉంది.
భారత జట్టు ఇంకా ఖాతా తెరవలేదు. బంగ్లాదేశ్ (-0.749) మైనస్ రన్‌రేట్ కలిగి ఉంది. ఇప్పుడీ జట్లన్నీ ఫైనల్‌లో స్థానం కోసం పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా కానీ, మరే కారణంతోనైనా తుడిచిపెట్టుకుపోతే రెండు జట్లకు సమానంగా పాయింట్లు పంచుతారు. అదే జరిగితే పాక్ ఖాతాలోకి మొత్తంగా 3 పాయింట్లు చేరుతాయి. భారత్ ఒకే ఒక్క పాయింట్ కలిగి ఉంటుంది. భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో కనీసం ఒక్కదాంట్లోనైనా గెలిస్తేనే భారత్ ఆశలు సజీవంగా ఉంటాయి. శ్రీలంక ఖాతాలో ఇప్పటికే రెండు పాయింట్లు ఉన్నాయి. భారత జట్టు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లతో తలపడాల్సి ఉండగా, వాటికి కూడా వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు.
సూపర్ 4లో శ్రీలంక మరియు బంగ్లాదేశ్‌తో భారత్ మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నప్పటికీ, ఆ మ్యాచ్‌లు వాష్‌అవుట్‌లను చూడలేవని గ్యారెంటీ లేదు. అందువల్ల, పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో సహా వర్షంతో కూడిన పోటీలు భారత జట్టుకు పెద్దగా ప్రయోజనకరంగా లేవు. కాబట్టి నేటి మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే ఎలాంటి భయం ఉండదు. లేదంటే టీమిండియాకు కష్టాలు తప్పకపోవచ్చు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రోహిత్ సేనకు రెండు పాయింట్లు వస్తాయి. మిగతా రెండు మ్యాచుల్లో ఒక్క దాంట్లో గెలిచినా భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. లేదంటే ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి.