Cyberscam: సైబర్ నేరగాళ్ల వలలో బెంగాలీ నటి.. మరునాడు పుట్టినరోజు అనగా దారుణ అనుభవం
- విద్యుత్ బిల్లు చెల్లించేందుకు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ నటి శ్రీలేఖ మిత్రకు ఫోన్
- తీవ్ర జ్వరంలో ఉన్న ఆమె సైబర్ నేరాగాళ్ల మోసాన్ని పసిగట్టడంలో విఫలం
- వారు చెప్పినట్టు చేయడంతో నటి బ్యాంక్ అకౌంట్ లో నుంచి రూ.లక్షకు పైగా మాయం
- తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి
- ఆన్లైన్ లావాదేవీల విషయంలో పూర్తి అప్రమత్తతో ఉండాలని హెచ్చరిక
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఏకంగా లక్ష రూపాయలకు పైగా పోగొట్టుకుంది. విద్యుత్ బిల్లు చెల్లించేందుకు యాప్ డౌన్‌లోన్ చేసుకోవాలంటూ నటిని ఒప్పించిన నేరగాళ్లు ఆమె డబ్బు దోచుకున్నారు. మరునాడు పుట్టిన రోజనగా ఆమెకు ఈ దారుణ అనుభవం ఎదురైంది. తనలాంటి తప్పు చేయద్దంటూ తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను హెచ్చరించింది.
ఆగస్టు 29న ఈ ఘటన జరిగినట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఆ రోజు తను జ్వరంతో బాధపడుతుండగా సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ వచ్చిందని తెలిపింది. విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఓ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని వారు సూచించారని తెలిపింది. తీవ్ర జ్వరంలో ఉన్న తను వారు చెబుతున్నది పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని, వారు నేరగాళ్లన్న విషయాన్ని పసిగట్టలేకపోయానని చెప్పింది. చివరకు సైబర్ మాయగాళ్లు చెప్పినట్టు చేయడంతో తన బ్యాంకు అకౌంట్ లో నుంచి లక్షకు పైగా నగదు పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్లైన్ లావాదేవీల విషయంలో పూర్తి అవగాహనతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని శ్రీలేఖ మిత్ర నెటిజన్లకు సూచించింది.