Nadendla Manohar: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్ ఇంతే: నాదెండ్ల

Nadendla slams CM Jagan after Chandrababu arrest
  • నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్
  • వ్యక్తిగతంగా కక్ష సాధించడం కోసమేనన్న నాదెండ్ల
  • విపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శలు
  • అరాచక పాలనను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపు
  • రేపు మంగళగిరిలో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ పై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వ్యక్తిగతంగా కక్ష సాధించడం కోసమే చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. 

విపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యమని, ఏపీలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. తెనాలిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో పవన్ కల్యాణ్ ను కూడా పోలీసులు అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. 

"సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జగన్ తీరు ఇలాగే ఉంది. నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ పనితీరుతో రాష్ట్రాన్ని నెగెటివ్ గ్రోత్ లోకి నెట్టేశారు. ఎప్పుడో మూడేళ్ల కిందట నమోదైన ఎఫ్ఐఆర్ ను తీసుకువచ్చి చంద్రబాబును అరెస్ట్ చేయడం వైసీపీ కక్షపూరిత వ్యవహార శైలికి పరాకాష్ఠ. ప్రజాసమస్యలపై మాట్లాడే విపక్షాల గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం పాలనా వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. 

దేశంలో ఓవైపు జీ20 సదస్సు జరుగుతోంది. రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలను ఎలా రప్పించాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వం విపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం వస్తే ప్రజలను కలుసుకోనివ్వకుండా నిర్బంధించారు. మా నేతలపై హత్యాయత్నం కేసులు మోపారు. 

ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అంతే... ఆయనపై కక్ష సాధించేందుకు మూడ్నాలుగు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒక విధంగా కేసులు పెట్టాలని చూస్తున్నారు. పోలీసులు ప్రొసీజర్ కు వ్యతిరేకంగా వెళ్లడం మంచిది కాదు" అని నాదెండ్ల పేర్కొన్నారు.
Nadendla Manohar
Chandrababu
Arrest
Jagan
Janasena
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News