affordable cars: అందుబాటు ధరలలో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లు ఇవిగో!

most affordable electric cars in india

  • మొదటి స్థానంలో ఎంజీ కామెట్ ఈవీ
  • రూ.8 లక్షల నుంచి ధర ప్రారంభం
  • తర్వాతి స్థానాల్లో టాటా టియాగో, సిట్రోయెన్ ఈసీ3

ప్రజల్లో పర్యావరణం పట్ల ప్రేమ పెరుగుతోంది. తదుపరి తరాలు ఆరోగ్యంగా జీవించాలంటే కాలుష్యం తగ్గించాలన్న స్పహ పెరుగుతోంది. దీంతో సంప్రదాయ ఇంధన ఆధారిత వాహనాలకు బదులు.. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. సంప్రదాయ ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం చాలా తక్కువగా ఉండడం కూడా వాహనదారులను ఆకర్షిస్తోంది.  ఈ క్రమంలో తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల వివరాలను పరిశీలిద్దాం.

ఎంజీ కామెట్ ఈవీ
 ప్రస్తుతం దేశంలో అతి తక్కువ ధరలో లభిస్తున్న చిన్న కారు ఇదే. ఇందులో ఇద్దరు అయితే సౌకర్యంగా కూర్చుని ప్రయాణించొచ్చు. మరో ఇద్దరు కూడా కూర్చునే సదుపాయం ఉంటుంది కానీ, అంత సౌకర్యంగా ఉండదు. ఒకరు లేదా ఇద్దరు రోజు కార్యాలయానికి వెళ్లాలనుకుంటే ఇది అనుకూలంగా ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. దీనికి రెండే డోర్లు ఉంటాయి. ఒక్కసారి చార్జ్ చేస్తే 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

టాటా టియాగో
 ఎంజీ కామెట్ తర్వాత అందుబాటులో ఉన్న మరో కారు టాటా టియాగో ఈవీ. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.8.69 లక్షలు. ఒక్కసారి చార్జ్ చేస్తే 250 నుంచి 315 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఈవీ కార్లలో ఇది కూడా ఒకటి. టాటా బ్రాండ్ పై వస్తుండడం, మారుతి తర్వాత దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ కు సర్వీస్ కేంద్రాలు ఎక్కువగా ఉండడం అనుకూలం. 

సిట్రోయెన్ ఈసీ3
ధరల పరంగా మూడో స్థానంలో ఉన్నది సిట్రోయెన్ ఈసీ3. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.11.50 లక్షలు. ఒక్కసారి చార్జ్ చేస్తే 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని సంస్థ చెబుతోంది. 57 నిమిషాల ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. 

టాటా టిగోర్ ఈవీ
టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్న టిగోర్ ఈవీ ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల పాటు మైలేజీనిస్తుంది. హాచ్ బ్యాక్ మోడల్. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.12.49 లక్షలు. 

మహీంద్రా ఎక్స్ యూవీ 400
 మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వస్తున్న ఎక్స్ యూవీ 400 విక్రయాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కారును ఒక్కసారి చార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేయవచ్చు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.15.99 లక్షలు. టాటా 

నెక్సాన్ ఈవీ
మన దేశంలో ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు ఇది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.15 లక్షలు. ఒక్కసారి చార్జ్ తో 465 కిలోమీటర్ల పాటు ప్రయాణించొచ్చు. ఇక్కడ ఎక్స్ షోరూమ్ ధర అనేది తుది ధర కాబోదు. దీనికి స్థానిక పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అదనంగా ఉంటాయి.

More Telugu News