Chandrababu: చంద్రబాబును అరెస్ట్ చేయడానికి కారణం ఇదే: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ

Chandrababu is main accused in Skill Development scam says AP CID Additional DG Sanjay

  • స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం కలిగిందన్న సీఐడీ అడిషనల్ డీజీ
  • చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడి
  • చంద్రాబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేస్తారని వ్యాఖ్య
  • లోకేశ్ ను కూడా ప్రశ్నిస్తామని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ప్రస్తుతం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. మరోవైపు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ఈ అరెస్ట్ కు సంబంధించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ లో చంద్రబాబును అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారని తెలిపారు. 

ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి రూ. 371 కోట్ల నష్టం వాటిల్లిందని అడిషనల్ డీజీ చెప్పారు. షెల్ కంపెనీలకు ఈ డబ్బును తరలించారని అన్నారు. చంద్రబాబు చెపితేనే అగ్రిమెంట్లు జరిగాయని చెప్పారు. ఇందులో చంద్రబాబే సూత్రధారి అని సాక్షులు చెప్పారని వెల్లడించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. 

ఈ కేసులో నారా లోకేశ్ ను కూడా ప్రశ్నించాల్సి ఉందని చెప్పారు. నిధులు కాజేసేందుకే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. గంటా సుబ్బారావును కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా నియమించారని తెలిపారు. ఆయనకు నాలుగు పదవులు కట్టబెట్టారని అన్నారు. 

ఈడీ, జీఎస్టీ సంస్థలు కూడా దీనిపై విచారణ జరిపాయని చెప్పారు. నకిలీ ఇన్ వాయిస్ ల ఆధారంగా నగదు బదిలీ చేశారని తెలిపారు. న్యాయ పరంగా అన్ని చర్యలు తీసుకునే చంద్రబాబును అరెస్ట్ చేశామని తెలిపారు. అన్ని వివరాలు బయటకు రావాలంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పదని అన్నారు. ఈ కేసులోని ఇతర నిందితులు దుబాయ్, యూఎస్ లలో ఉన్నారని... వారిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఆయా దేశాలకు అధికారులు వెళ్తారని చెప్పారు.

  • Loading...

More Telugu News