rishi sunak: 'హిందువుగా గర్విస్తున్నాను.. రేపటి లీడర్లతో భేటీ' అంటూ రిషిసునక్ ట్వీట్

Rishi Sunak meeting with the world leaders of tomorrow

  • గుళ్లకు వెళ్తానని, రాఖీ పండుగను బాగా జరుపుకున్నానన్న బ్రిటన్ ప్రధాని
  • భారత్ రావడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమని వ్యాఖ్య
  • తనకు ప్రధాని మోదీ అంటే ప్రత్యేక అభిమానమని వెల్లడి
  • ఖలిస్థాన్ పేరుతో జరిగే హింసను సహించనని ఆగ్రహం

తాను హిందువునైనందుకు గర్విస్తున్నానని బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ అన్నారు. ఢిల్లీలో రేపటి నుండి జరగనున్న జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను హిందువుగానే పెరిగానని, అలానే ఉన్నానని చెప్పారు. తాను గుళ్లకు వెళతానని, ఇటీవలే రాఖీ పండుగను బాగా జరుపుకున్నట్లు చెప్పారు. భారత్ రావడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమని, తన కుటుంబీకులకు చెందిన భారత్ అంటే చాలా ప్రేమ అన్నారు.

తాను ప్రస్తుతం యూకే ప్రధాని బాధ్యతల్లో వచ్చానని, భారత్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకునే మార్గాలను కనుగొనడం, జీ20 సదస్సును విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. వసుధైక కుటుంబం అనే గొప్ప థీమ్‌తో జీ20 సదస్సు జరుగుతోందన్నారు. తనకు ప్రధాని మోదీ అంటే ప్రత్యేక అభిమానం అన్నారు.

ఖలిస్థాన్ పేరుతో హింసను సహించను

ఖలిస్థాన్ తీవ్రవాదం అంశాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు. ఈ అంశానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరించుకుంటున్నట్లు చెప్పారు. తీవ్రవాదం, హింస ఏ రూపంలో ఉన్నా వాటిని బ్రిటన్ అంగీకరించదన్నారు. బ్రిటన్‌లో దీనికి తావులేదన్నారు. హింసాత్మక చర్యలు ఏమాత్రం సరికావని, బ్రిటన్‌లో తాను ఖలిస్థాన్ తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించనని చెప్పారు.

రేపటి లీడర్లతో అంటూ ట్వీట్....

భారత్‌లో అడుగుపెట్టిన అనంతరం రిషి సునక్ విద్యార్థులను కలిశారు. ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారు. రేపు జీ20 సమావేశాల్లో ప్రపంచ నేతలను కలవడానికి ముందు రేపటి ప్రపంచ నాయకులతో సమావేశమయ్యానని పేర్కొన్నారు.

rishi sunak
UK
g20
Narendra Modi
  • Loading...

More Telugu News