Ambati Rambabu: తనను అరెస్ట్ చేస్తారని చంద్రబాబే చెప్పుకుంటున్నాడు: అంబటి రాంబాబు ఎద్దేవా
- తప్పు చేశాడు కాబట్టే చంద్రబాబు ఐటీ నోటీసులకు భయపడుతున్నారన్న మంత్రి
- ఐటీ అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం
- ముడుపులు అందాయని నిర్ధారించుకున్నాకే నోటీసులు ఇచ్చి ఉంటారని వ్యాఖ్య
తప్పుచేసిన వారిని ఎవరినైనా, ఎక్కడైనా అరెస్ట్ చేస్తారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఐటీ నోటీసులపై మంత్రి... శుక్రవారం మరోసారి స్పందించారు. ఆయన తప్పు చేశాడు కాబట్టే ఐటీ నోటీసులకు భయపడుతున్నారన్నారు. నోటీసులు ఇచ్చినందుకు గాను ఆయన అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అంశంలో రూ.118 కోట్ల మేర ముడుపులు తీసుకున్నారని నిర్ధారించుకున్న తర్వాతే ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారన్నారు.
తనను అరెస్ట్ చేస్తారని తనంతట తానుగానే టీడీపీ అధినేత చెప్పుకుంటున్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా, ఎక్కడైనా అరెస్ట్ చేస్తారన్నారు. సభలు, యాత్రల పేరుతో పోలీసులపై ఎవరైనా రాళ్ల దాడి చేస్తే ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులకు మంత్రి అంబటి ఓ సూచన చేశారు. రైతులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఏపీలో వర్షాభావం ఉన్నందున పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేస్తామన్నారు.