Rajamouli: బాక్సాఫీసు దద్దరిల్లింది... 'జవాన్' చిత్రంపై రాజమౌళి స్పందన
- ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రం
- షారుఖ్ ఖాన్ ను బాద్ షా అని ఎందుకుంటారో అర్థమైందన్న రాజమౌళి
- అట్లీ ఉత్తరాదిన కూడా నెగ్గుకొస్తున్నాడని కితాబు
- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంపైనా రాజమౌళి రివ్యూ
దర్శక దిగ్గజం రాజమౌళి జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలపై స్పందించారు. చాలాకాలం తర్వాత వరుసగా రెండు సినిమాలు చూశానని వెల్లడించారు.
'జవాన్' చిత్రంపై తన అభిప్రాయాలను పంచుకుంటూ... షారుఖ్ ఖాన్ ను బాక్సాఫీసు బాద్ షా అని ఎందుకంటారో ఇప్పుడర్థమైందని తెలిపారు. 'జవాన్' ఓపెనింగ్ దద్దరిల్లిపోయిందని పేర్కొన్నారు. ఉత్తరాదిలోనూ విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న దర్శకుడు అట్లీకి శుభాభినందనలు తెలుపుతున్నట్టు రాజమౌళి పేర్కొన్నారు. ఈ అద్భుతమైన విజయం పట్ల 'జవాన్' చిత్రబృందాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు.
ఇక, అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' చిత్రంపైనా రాజమౌళి రివ్యూ ఇచ్చారు. స్వీటీ (అనుష్క) చాలా అందంగా, జిగేల్మనిపించేలా ఉందని అభివర్ణించారు. నవీన్ పోలిశెట్టి కడుపుబ్బా నవ్వించాడని, అతడి పాత్ర ఎంతో వినోదాన్ని అందించిందని తెలిపారు. ఎంతో సున్నితమైన కథాంశాన్ని నేర్పుగా తెరకెక్కించాడంటూ దర్శకుడు మహేశ్ బాబు పచ్చిగొల్లను రాజమౌళి అభినందించారు. అంతేకాదు, ఈ సినిమా ఘన విజయం పట్ల చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.