Human Extinction: అప్పట్లో ఈ భూమ్మీద మిగిలింది 1,280 మంది మాత్రమేనట!
- పది లక్షల సంవత్సరాల క్రితం అంతరించే దశకు మానవజాతి
- ఆధునిక మానవుడిలోని 65.85 శాతం జన్యువైవిధ్యం అప్పట్లో లేదని నిర్ధారణ
- 3,154 మంది ఆధునిక మానవులపై జరిపిన పరిశోధనలో వెల్లడి
మనం నివసిస్తున్న ఈ భూమ్మీద ఒకప్పుడు మానవజాతి అంతరించే దశకు చేరుకుందా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా జరిపిన ఓ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది. దాదాపు 10 లక్షల సంవత్సరాల క్రితం మానవజాతి దాదాపు అంతరించే దశకు చేరుకుందన్న విషయం వెలుగుచూసింది. అప్పుడు కేవలం 1,280 మంది మాత్రమే మిగిలారని అధ్యయనం వెల్లడించింది. అప్పట్లో ఎదురైన తీవ్రమైన ఇబ్బందులు మానవజాతి మనుగడను ప్రశ్నార్థకం చేశాయని పరిశోధకులు పేర్కొన్నారు.
అలా మిగిలిన వారి ద్వారా మళ్లీ జాతి నిలకడగా వృద్ధి చెందిందని వివరించారు. మొత్తం 3,154 మంది ఆధునిక మానవుల జన్యుక్రమంపై పరిశోధన నిర్వహించారు. ఫిట్‌కోల్ అనే పద్ధతి ఆధారంగా ఆఫ్రికా, యూరేషియాలోని వేల ఏళ్ల క్రితం నాటి శిలాజాలను విశ్లేషించారు. ఆధునిక మానవుడిలో కనిపిస్తున్న 65.85 శాతం జన్యు వైవిధ్యం లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవుల్లో లేదని, దీనర్థం అప్పట్లో మానవజాతి అంతరించే దశకు చేరుకోవడమే కారణమని వివరించారు.