China school: ప్రత్యేక చార్జీ చెల్లిస్తే.. పాఠశాలలో భోజనం తర్వాత కునుకుతీయచ్చు!

China schools unusual fee for student naps sparks outrage
  • చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఓ ప్రైవేటు పాఠశాల ప్రయోగం
  • లంచ్ బ్రేక్ సమయంలో నిద్రకు మూడు  రకాల ప్యాకేజీలు
  • పర్యవేక్షకులుగా టీచర్ల నియామకం
ప్రైవేటు స్కూళ్ళు రకరకాల ఫీజుల రూపంలో ఎలా దోచేస్తాయో మనకు తెలుసు. అయితే, చైనాలోని ఓ పాఠశాల అదనపు ఆదాయం కోసం సరికొత్త ప్రయోగం చేసింది. మధ్యాహ్నం పూట పిల్లలకు స్లీప్ సెషన్ అంటూ నిద్ర పీరియడ్ కేటాయించింది. కాకపోతే ఇది ఉచితం కాదు. ఇందుకు అదనపు ఫీజు చెల్లించుకోవాల్సి ఉంటుంది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో జీషెంగ్ ప్రాథమిక పాఠశాల (ప్రైవేటు) ఈ విధానానికి శ్రీకారం చుట్టింది.

చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వీచాట్ పై స్కూల్ నోటీసు స్క్రీన్ షాట్ వైరల్ గా మారిపోయింది. హాంగ్ కాంగ్ కేంద్రంగా నడిచే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే మీడియా సంస్థ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. స్కూల్ నోటీసులో పేర్కొన్న వివరాలు ప్రకారం.. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం అనంతరం కునుకు తీయవచ్చు. ఇందుకు మూడు రకాల ప్యాకేజీలు ఉన్నాయి. 

తరగతి గదిలో డెస్క్ వద్దే నిద్ర పోయేట్టు అయితే చార్జీ 200 యువాన్లు. అటే 28 డాలర్లు (రూ.2,324). క్లాస్ రూమ్ లో కింద మ్యాట్ పై పడుకునేట్టు అయితే అప్పుడు 360 యువాన్లు (49.29 డాలర్లు) అవుతుంది. ఇక ప్రైవేటు రూమ్ లో ఏర్పాటు చేసిన పడకలపై నిద్రించాలని కోరుకునే వారికి 680 యువాన్లను (93 డాలర్లు) ఒక నెలకు చెల్లించుకోవాలి. నిద్రించే సమయంలో పిల్లల వద్ద టీచర్లను పర్యవేక్షకులుగా నియమిస్తుంది. 

ప్రైవేటు పాఠశాలలు ఈ తరహా సేవలు నిర్వహించుకోవచ్చని అక్కడి అధికారులు సైతం స్పష్టం చేయడం గమనార్హం. అయితే, పాఠశాలల్లో లంచ్ బ్రేక్ సమయంలో నిద్రించడం తప్పనిసరి ఏమీ కాదని స్కూల్ సిబ్బంది ఒకరు స్పష్టం చేశారు. చార్జీ చెల్లించి నిద్ర పోవడం ఇష్టం లేని వారు.. లంచ్ బ్రేక్ లో ఇంటికి వెళ్లి రావచ్చని చెప్పారు.
China school
sleep packages
nap session

More Telugu News