Andhra Pradesh: తమను అరెస్ట్ చేసి రాత్రంతా రోడ్లపై తిప్పారంటున్న యువగళం వాలంటీర్లు!

Yuvagalam Valunteers arrested by AP Police

  • క్యాంప్ సైట్ నుంచి తీసుకెళ్లిన పోలీసులు  
  • పోలీసుల అదుపులో 50 మంది వాలంటీర్లు
  • రాళ్ల దాడిలో దెబ్బలు తిన్న తమనే అరెస్టు చేయడమేంటన్న వాలంటీర్లు  

పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న యువగళం పాదయాత్ర మంగళవారం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడితో టీడీపీ నేతలకు, పలువురు కార్యకర్తలు, వాలంటీర్లకు గాయాలయ్యాయి. తమపై దాడి జరుగుతున్నా పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తలకే అండగా నిలబడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. అనంతరం మంగళవారం అర్ధరాత్రి ప్రాంతంలో యువగళం క్యాంప్ సైట్ పై పోలీసులు దాడి చేసి, నిద్రిస్తున్న వాలంటీర్లు, కిచెన్ సిబ్బంది సహా మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. మూడు వాహనాల్లో వచ్చిన పోలీసులు.. వాటిలో యువగళం వాలంటీర్లను తరలించారు. రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పి ఉదయం సిసిలీలోని వైసీపీ నేతకు చెందిన రాజ్యలక్ష్మి మెరైన్ ఎక్స్ పోర్ట్స్ ఫ్యాక్టరీలో ఉంచినట్టు తెలుస్తోంది.

రాత్రంతా రోడ్లపై తిప్పుతూ పోలీసులు తమపై విచక్షణారహితంగా దాడి చేశారని యువగళం వాలంటీర్లు ఆరోపించారు. భీమవరం, నర్సాపురం, వీరవాసరం పోలీస్ స్టేషన్లకు తిప్పారని వివరించారు. తమపై రాళ్ల దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను కాకుండా.. రాళ్ల దాడిలో దెబ్బలు తిన్న తమనే అరెస్టు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, తమ అదుపులో ఉన్న యువగళం వాలంటీర్లపై 307 సెక్షన్ (హత్యాయత్నం) కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించాకే యాత్ర చేపట్టామని, వైసీపీ కార్యకర్తలతో కవ్వింపు చర్యలు చేపట్టి, ఇప్పుడు వాలంటీర్లను అరెస్టులు చేశారని మండిపడ్డారు.

Andhra Pradesh
yuvagalam
bhimavaram
police
arrests

More Telugu News