Asia Cup 2023: ఆసియాకప్: లంకకు ముచ్చెమటలు పట్టించి ఓడిన ఆఫ్ఘనిస్థాన్ .. సూపర్-4లోకి శ్రీలంక

Sri Lanka Beat Afghanistan By 2 Runs

  • లాహోర్‌లో శ్రీలంక చేతిలో రెండు పరుగుల తేడాతో ఓటమి
  • 292 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వేగంగా ఆడిన ఆఫ్ఘనిస్థాన్
  • 37.4 ఓవర్లలోనే 289 పరుగులు సాధించిన ఆఫ్ఘనిస్థాన్
  • టోర్నీ నుంచి నిష్క్రమణ

ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 292 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే విజయం దిశగా అడుగులేసిన ఆఫ్ఘన్ జట్టు చివరికి రెండంటే రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై సూపర్-4 అవకాశాన్ని చేజార్చుకుంది. ఆఫ్ఘన్ సూపర్-4కు చేరాలంటే 37.1 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. ఈ క్రమంలో ధాటిగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 37.4 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌట్ అయింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఆఫ్ఘనిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఒక్క మ్యాచ్‌లో నెగ్గిన బంగ్లాదేశ్ జట్టు సూపర్-4కి అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేయగా, ఓపెనర్ పాతుమ్ నిశ్శంక 41, కరుణరత్నె 32, అసలంక 36, దునిత్ వెల్లలగే 33 (నాటౌట్), తీక్షణ 28 పరుగులు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బాదిన్ 4 వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 292 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ మెరుపు వేగంతో ఆడింది. అయితే, వికెట్లను క్రమం తప్పకుండా పారేసుకోవడంతో ఓటమి పాలైంది. 37.4 ఓవర్లలోనే 289 పరుగులు చేసి విజయానికి మూడు పరుగుల ముందు బోల్తాపడింది. కాస్తంత నిదానంగా, తెలివిగా ఆడివుంటే ఆఫ్ఘనిస్థాన్ గెలిచి ఉండేదే. ప్రణాళిక లోపమే జట్టుకు శాపంగా మారింది.

మహమ్మద్ నబీ 32 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 65 పరుగులు చేసి శ్రీలంకకు ముచ్చెమటలు పట్టించగా, గుల్బాదిన్ నైబ్ 22, రహ్మత్ షా 45, కెప్టెన్ హస్మతుల్లా షాహిద్ 59, కరీం జనత్ 22, నజీబుల్లా జద్రాన్ 23, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితకు 4 వికెట్లు దక్కాయి. కుశాల్ మెండిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఆసియాకప్‌లో నేటి నుంచి సూపర్-4 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.  నేడు లాహోర్‌లో బంగ్లాదేశ్-పాకిస్థాన్ జట్లు తలపడతాయి.

Asia Cup 2023
Sri Lanka
Afghanistan
Super-4
  • Loading...

More Telugu News