Heavy rain: మేడ్చల్ లో నీట మునిగిన అపార్ట్ మెంట్లు.. వీడియో ఇదిగో!
- మొదటి అంతస్తు వరకు చేరిన నీరు
- మైసమ్మగూడలో వరదలో చిక్కుకున్న జనం
- కాపాడాలంటూ ఇంజనీరింగ్ స్టూడెంట్ల ఆవేదన
ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మేడ్చల్ లో పలు అపార్ట్ మెంట్లు నీట మునిగాయి. మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరుకుంది. దీంతో అపార్ట్ మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. బయటకు వచ్చే పరిస్థితి లేదని, తమను కాపాడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మైసమ్మగూడలోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. దాదాపు 30 అపార్ట్‌మెంట్లలో వరద నీరు చేరింది. వీటిలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటున్నారు. వరద ముంచెత్తడంతో సాయం కోసం వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు, రెవిన్యూ, అధికారులు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. రెండు జేసీబీలను తెప్పించి అపార్ట్ మెంట్లలో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకొస్తున్నారు.
మేడ్చల్ లోని మైసమ్మగూడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులు పక్కనే ఉన్న అపార్ట్ మెంట్లలో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చుట్టుపక్కల ఉన్న నాలుగు ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే సిబ్బంది కూడా ఈ అపార్ట్ మెంట్లలోనే ఉంటున్నారు. ప్రస్తుతం వరద ముంచెత్తడంతో వారంతా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు నీళ్లు వెళ్లే మార్గంలో అపార్ట్ మెంట్లు నిర్మించడంతో అక్కడ భారీగా వరద నీరు చేరింది.