ISRO: తొలినాళ్లలో ఇస్రోను ఏమనేవారంటే.. ఇస్రో గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు!
- 1975లో తొలి ఉపగ్రహం 'ఆర్యభట్ట'ను సోవియట్ యూనియన్ రాకెట్ ద్వారా పంపించిన ఇస్రో
- ఒకేసారి 104 రాకెట్లను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చి రికార్డుల్లోకి..
- అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపిన నాలుగో సంస్థ మనదే
చంద్రయాన్-3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. తక్కువ ఖర్చుతో మెరుగైన సక్సెస్ రేటుతో ప్రయోగాలు పూర్తిచేయడం ఇస్రోకే సాధ్యమని పేరు తెచ్చుకుంది. దీంతో ప్రపంచ దేశాలు ఇస్రో వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రో గురించి కొన్ని విశేషాలు..
- తొలినాళ్లలో సైకిల్ పై రాకెట్ ను మోసుకెళ్లిన చరిత్ర ఇస్రోకు ఉంది. అంతరిక్ష ప్రయోగాల కోసం భారత ప్రభుత్వం 1962లో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ‘ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చి (ఐఎన్ సీఓఎస్ పీఏఆర్)’ గా వ్యవహరించేవారు. దీనికి డాక్టర్ విక్రమ్ సారాభాయి నేతృత్వం వహించారు.
- అంతరిక్ష ప్రయోగాలలో మరింత అడ్వాన్స్ పరిశోధనల కోసం ఐఎన్ సీఓఎస్ పీఏఆర్ కు మరిన్ని మార్పులు చేసి 1969 ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గా మార్చింది. 1972లో ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ ను ఏర్పాటు చేసి ఇస్రోను దాని పరిధిలోకి తీసుకొచ్చింది.
- అంతరిక్ష ప్రయోగాలు మాత్రమే కాదు.. దేశంలో సైన్స్, టెక్నాలజీ విద్యలోనూ ఇస్రో సేవలందిస్తోంది. రిమోట్ సెన్సింగ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, అట్మాస్ఫియరిక్ సైన్స్, స్పేస్ సైన్స్ తదితర రంగాలకు చెందిన సంస్థలకు, పరిశోధనా సంస్థలకు ఇస్రో వెలకట్టలేని సేవలందిస్తోంది.
- 1975 లో భారత దేశ తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ ను ప్రయోగించింది. సోవియట్ యూనియన్ కు చెందిన కాస్మోస్-3ఎం రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది.
- 2008లో చంద్రుడిపైకి తొలి మిషన్ ‘చంద్రయాన్ 1’ ను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసింది.
- ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి 2017లో ప్రపంచ రికార్డును సృష్టించింది.
- అంగారకుడిపైకి వ్యోమనౌకను పంపిన నాలుగవ స్పేస్ ఏజెన్సీగా ఇస్రో రికార్డులకు ఎక్కింది.
- ప్రజల సౌకర్యం కోసం భువన్ పేరుతో జియోపోర్టల్ ను రూపొందించింది. ఇటీవల చంద్రయాన్-3 ప్రయోగంతో ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. తక్కువ ఖర్చుతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారతదేశాన్ని చరిత్రపుటల్లోకి ఎక్కించింది.