Rajinikanth: రజనీకాంత్‌కు గవర్నర్ పదవిపై సోదరుడు కీలక వ్యాఖ్యలు
- పన్నీర్‌సెల్వంతో రజనీకాంత్ భేటీకి రాజకీయ ప్రాధాన్యం లేదన్న సోదరుడు సత్యనారాయణ
- రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉందని వ్యాఖ్య
- రాజకీయాల్లోకి మాత్రం రాబోరని స్పష్టీకరణ
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరుడు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉందని చెబుతూ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశారు. అంతమాత్రాన ఆయన రాజకీయాల్లోకి మాత్రం రాబోరని స్పష్టం చేశారు. నిన్న మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో రజనీకాంత్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. రజనీకి గవర్నర్ పదవి మాత్రం దేవుడి చేతుల్లోనే ఉందన్నారు. ఇటీవల ఉత్తర భారతదేశంలో పర్యటించిన సూపర్‌స్టార్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడంతో గవర్నర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దీంతో స్పందించిన ఆయన సోదరుడు సత్యనారాయణ ఈ విషయంలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసి ప్రచారానికి మరింత ఆజ్యం పోశారు.