Andhra Pradesh: ఏపీకి ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన
- ఏపీలో విస్తారంగా వర్షాలు
- ఉత్తరాంధ్ర, యానాంలో ఈ నెల 8 వరకు వర్షాలు
- దక్షిణ కోస్తా, రాయలసీమలో ఈ నెల 7 వరకు వర్షాలు
- పల్నాడు జిల్లా అచ్చంపేటలో అత్యధికంగా 97.6 మిల్లీమీటర్ల వర్షపాతం
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది.
ఉత్తరాంధ్ర, యానాం జిల్లాల్లో ఈ నెల 8 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 7 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.
ఇక, ఇవాళ ఏపీలో చాలాప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పల్నాడు జిల్లా అచ్చంపేటలో 97.6 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 92.8 మి.మీ, పల్నాడు జిల్లా మాచర్లలో 81.2 మి.మీ, నెల్లూరు జిల్లా కందుకూరులో 80.4 మి.మీ వర్షపాతం నమోదైంది.