Sarmat: ప్రపంచంలోనే అత్యంత వినాశకర సాతాన్-2 అణు క్షిపణులను బయటికి తీసిన రష్యా
- ఉక్రెయిన్ పై ఏడాదిన్నరగా రష్యా యుద్ధం
- ఉన్నట్టుండి సర్మాత్ (సాతాన్-2) క్షిపణులను మోహరించిన రష్యా సైన్యం
- యూరప్ లోని ఏ భాగానికైనా మూడు నిమిషాల్లో చేరుకునే సర్మాత్
- ఒక్క క్షిపణితో 15 లక్ష్యాలను ఛేదించే అవకాశం
"సర్మాత్ (సాతాన్-2) అణు క్షిపణి ప్రయోగం విజయవంతమైంది... మాతో పెట్టుకోవాలనుకునేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది..." అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలో తమ ప్రత్యర్థి దేశాలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్షిపణి సామర్థ్యం గురించి తెలిసిన వాళ్లకు పుతిన్ ఎందుకు అంత ధీమాగా ఈ మాటలు అన్నాడో అర్థమవుతుంది.
ప్రపంచంలోనే అత్యంత వినాశకర అణు క్షిపణిగా ఆర్ఎస్-28 సర్మాత్ లేక సాతాన్-2 క్షిపణికి పేరుంది. ఇది ఖండాంతర బాలిస్టిక్ శ్రేణికి చెందినది. ఈ ఒక్క మిస్సైల్ కు 15 వార్ హెడ్లు అమర్చే అవకాశం ఉంది. ఇది సృష్టించే విధ్వంసం ఊహకందనిది.
ఇప్పుడు ఉన్నట్టుండి రష్యా శత్రు భయంకర సాతాన్-2 క్షిపణులను మోహరించడం తీవ్ర కలకలం రేపుతోంది. గతంలో పుతిన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం పాశ్చాత్య దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యూరప్ లో ఉద్రిక్తతలు నెలకొని ఉండగా, ఇప్పుడు పుతిన్ సేనలు అణు క్షిపణులను కీలక స్థానాల్లో మోహరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. ఏడాదిన్నర గడిచినా ఉక్రెయిన్ లొంగింది లేదు. ఇప్పుడు భయానక అస్త్రం సర్మాత్ మిస్సైళ్లను రష్యా బయటికి తీయడం చూస్తుంటే, ఏదో జరగబోతోందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మాతృదేశాన్ని కాపాడుకోవడానికి 'అన్ని అవకాశాలు' ఉపయోగించుకుంటాం అని పుతిన్ ఇటీవల జాతీయ టెలివిజన్ లో ప్రసంగించారు. 'అన్ని అవకాశాలు' అంటే పుతిన్ దృష్టిలో అణ్వస్త్రాలేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సర్మాత్ క్షిపణుల ప్రత్యేకతలు ఇవే...
- శత్రు దేశాల రాడార్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు దీన్ని గుర్తించే లోపే లక్ష్యాన్ని తాకుతుంది.
- గరిష్ఠంగా గంటకు 12 వేల మైళ్ల వేగంతో దూసుకుపోతుంది. తద్వారా యూరప్ లోని ఏ భాగానికైనా 3 నిమిషాల్లోపే చేరుకుంటుంది.
- ఇది 116 మీటర్ల పొడవు, 220 టన్నుల బరువుతో చూడ్డానికే భయం పుట్టించేలా ఉంటుంది.
- దీనికి 15 వార్ హెడ్లు అమర్చే వీలుంటుంది. అందువల్ల, ఈ ఒక్క క్షిపణితో ఒకటికి మించిన లక్ష్యాలను ఛేదించవచ్చు.
- దీని రేంజి 11,180 మైళ్లు అని అమెరికా చెబుతోంది.