Aditya L1: అందరి ఆశలూ ‘ఆదిత్య ఎల్1’ పైనే.. ఐఎస్ఎస్ మాజీ వ్యోమగామి కీలక వ్యాఖ్య
- ఆదిత్య ఎల్1 మిషన్ ప్రపంచానికి కీలకమని వ్యాఖ్యానించిన ఐఎస్ఎస్ మాజీ వ్యోమగామి క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్
- ఈ మిషన్ సేకరించే సూర్యుడి సమాచారం యావత్ మానవాళికి ఉపయోగపడుతుందని వివరణ
- భూమ్మీద ప్రతిఒక్కరూ ఆదిత్య ఎల్ 1పై ఆశలు పెట్టుకున్నారని వ్యాఖ్య
చంద్రయాన్-3 విజయంతో ఇస్రో ఖ్యాతి అమాంతం పెరిగిపోయింది. దీంతో, నేడు ఇస్రో ప్రయోగించనున్న ‘ఆదిత్య ఎల్1’ పైనే ప్రపంచం దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) మాజీ వ్యోమగామి క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రశంసించిన క్రిస్.. ఇస్రో నేడు ప్రయోగించనున్న ఆదిత్య ఎల్1పై భూమ్మీద ప్రతిఒక్కరు ఆశలు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్1 మిషన్‌కు కౌంట్ డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. నేడు 11.50కు శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఎల్1 లగ్రాంజ్ పాయింట్ వద్ద ఈ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టనున్నారు.
రాబోయే కాలంలో అంతరిక్షంలో మానవ ప్రయాణాలపై ఈ మిషన్ ఎంతగానో ప్రభావం చూపుతుందని మాజీ ఆస్ట్రోనాట్ క్రిస్ పేర్కొన్నారు. ఇది మానవాళి అంతటికీ ఉపయోగపడే ప్రయోగమని వివరించారు. సూర్యుడిపై లోతైన అధ్యయనంతో యావత్ మానవాళిని సౌర తుపానుల ప్రతికూల ప్రభావం నుంచి కాపాడవచ్చని, ఎలక్ట్రిల్, ఇంటర్నెట్ నెట్వర్క్‌లను, శాటిలైట్ వ్యవస్థలను కాపాడుకోవచ్చని తెలిపారు.
ఇక భూమికి సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్‌ను చేరుకునేందుకు ఆదిత్య ఎల్1కు సుమారు నాలుగు నెలల సమయం పడుతుంది. అక్కడి నుంచి ఆదిత్య సూర్యడిలోని ప్లాస్మా, అయస్కాంత క్షేత్రంలోని మార్పులను నిశితంగా గమనిస్తుంది. ఆదిత్య ఎల్ 1 ద్వారా సేకరించే సమాచారం ఇస్రోకే కాకుండా యావత్ ప్రపంచానికీ కీలకమని క్రిస్ తెలిపారు.