Tomato: బడుగు జీవులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న కూరగాయల ధరలు.. నేలకు దిగిన టమాటా
- సరూర్‌నగర్ మార్కెట్లో కిలో టమాటా రూ. 15
- ఏపీలోని మదనపల్లి మార్కెట్లో అత్యల్పంగా రూ. 5 పలికిన ధర
- ఉత్పత్తి పెరిగి డిమాండ్ తగ్గడమే కారణం
- దేశంలోని మిగతా మార్కెట్లలోనూ కూరగాయల ధరల తగ్గుముఖం
పెరిగిన కూరగాయల ధరలతో అల్లాడిపోతున్న బడుగు జీవులకు ఇది శుభవార్తే. ఇటీవల భారీగా పెరిగి భయపెట్టిన టమాటాతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా దిగొస్తున్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల టమాటా ధరలు చాలా ప్రాంతాల్లో గరిష్ఠంగా రూ.200 వరకు చేరుకున్నాయి. దాదాపు రెండుమూడు నెలలపాటు అదే ధర కొనసాగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టగా, తాజాగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 15కు పడిపోయింది.
వంకాయ, దొండ, బెండ, కాకరకాయ, పచ్చిమిరప సహా ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. చాలామంది రైతులు నేరుగా రైతు బజార్లకే తెచ్చి విక్రయిస్తుండడం, డిమాండ్ కంటే ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ధరలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. ఏపీలోని మదనపల్లి వ్యవసాయ మార్కెట్లో కిలో టమాటా అత్యల్పంగా రూ. 5 నుంచి రూ. 9 మధ్య పలికింది. అలాగే, మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్, కోలార్, చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి.