Ravi Shastri: రేపు ఆసియా కప్ లో భారత్-పాక్ సమరం... రవిశాస్త్రి వ్యాఖ్యలు
- ఆసియా కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పాక్, శ్రీలంక
- సెప్టెంబరు 2న భారత్, పాక్ అమీతుమీ
- శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో హై ఓల్టేజ్ మ్యాచ్
- టీమిండియానే ఫేవరెట్ అన్న రవిశాస్త్రి
- అయితే పాక్ ను తక్కువ అంచనా వేయరాదని సూచన
పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్-2023 టోర్నీలో రేపు (సెప్టెంబరు 2) దాయాదుల సమరం జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ కు శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా నిలవనుంది.
భారత్-పాక్ మ్యాచ్ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2011 వరల్డ్ కప్ గెలిచాక టీమిండియా ఇంత బలంగా ఉండడం ఇదే ప్రథమం అని వెల్లడించారు. పాకిస్థాన్ తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్ లో భారత జట్టే ఫేవరెట్ అని స్పష్టం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ అనుభవం, జట్టు కూర్పు టీమిండియాకు లాభించే అంశాలని తెలిపారు.
అయితే, పాకిస్థాన్ ను తక్కువగా అంచనా వేయరాదని, గత కొన్నాళ్లుగా ఆ జట్టు రాటుదేలిందని రవిశాస్త్రి గుర్తు చేశారు. ఏడెనిమిదేళ్ల కిందట పాకిస్థాన్ జట్టుకు, భారత జట్టుకు చాలా తేడా ఉండేదని, ఇప్పుడా అంతరం బాగా తగ్గిపోయిందని, పాక్ దృఢమైన జట్టుగా రూపొందిందని వివరించారు.
పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ఒత్తిడి ఉంటుందని, ప్రశాంతంగా ఆడడమే కీలకమని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇది కూడా అన్ని మ్యాచ్ ల వంటిదే అనే భావనతో బరిలో దిగాలని టీమిండియా ఆటగాళ్లకు సూచించారు. అలా కాకుండా, ఈ మ్యాచ్ కు అతి ప్రాధాన్యత ఇస్తే ఆలోచనా విధానం మారిపోతుందని పేర్కొన్నారు. మానసికంగా దృఢంగా ఉండే ఆటగాళ్లు ఈ పరిస్థితిని అధిగమించగలరని తెలిపారు.
భారత్-పాక్ మ్యాచ్ లో ఫామ్ ఎంతమాత్రం సమస్య కాదని, గత ఆర్నెల్లుగా విఫలమవుతున్న ఆటగాళ్లు కూడా దాయాదుల సమరం అనగానే విజృంభించే అవకాశాలుంటాయని, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమని రవిశాస్త్రి స్పష్టం చేశారు.