Toor Dal: ఇప్పుడు కందిపప్పు వంతు.. పెరుగుతూ పోతున్న ధర
- రూ. 160-170 మధ్య పలుకుతున్న కిలో కందిపప్పు ధర
- త్వరలోనే రూ. 200కు చేరే అవకాశం
- గణనీయంగా తగ్గిన సాగు
- దిగుమతి చేసుకునే యోచనలో కేంద్రం
నూనెలు, ఉల్లిపాయలు, టమాటాలు అయిపోయాయి. ఇప్పుడు కందిపప్పు వంతు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో గత 8 నెలల్లో కందిపప్పు ధర 55 శాతం ధర పెరిగింది. ప్రస్తుతం కిలో రూ. 160-170 మధ్య పలుకుతుండగా, బ్రాండెడ్ కందిపప్పును రూ. 180కిపైనే విక్రయిస్తున్నారు. మున్ముందు ధర రూ. 200 దాటే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సాగు తగ్గడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో కిలో కందిపప్పు ధర రూ. 98 నుంచి రూ.110 వరకు ఉంది. ఆగస్టులో రూ. 170కి చేరుకుంది. అంటే గత 8 నెలల్లో 55 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో గరిష్ఠంగా 8.50 లక్షల ఎకరాల్లో కందిపప్పు సాగుచేసేవారు. గతేడాది ఇది 6 లక్షల ఎకరాలకు పడిపోయింది. ఈ పంట ద్వారా 1.09 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేయగా, వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయాయి.
మరోవైపు, ఈ ఏడాది కందిసాగు దారుణంగా పడిపోయింది. ఆగస్టు నెలాఖరు నాటికి 292 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. దేశవ్యాప్తంగానూ కంది సాగు గణనీయంగా తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. 2018లో దేశంలో 43 లక్షల కందిపప్పు ఉత్పత్తి కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 34 లక్షల టన్నులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కందిపప్పును దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది.