Chandrababu: దసరా రోజున పూర్తి మేనిఫెస్టో... ఏపీ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

TDP Supreme Chandrababu wrote open letter to AP people
  • రేపటి నుంచి 45 రోజలు పాటు చంద్రబాబు ప్రచారం
  • రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతానని వెల్లడి
  • 45 రోజుల్లో 3 కోట్ల మందిని కలుసుకోవాలన్నదే తన లక్ష్యమన్న చంద్రబాబు
  • టీడీపీ కార్యాచరణకు ప్రజల భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. 'బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ' కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 

రేపటి నుంచి 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపడుతున్నానని, 45 రోజుల్లో 3 కోట్ల మందిని కలుసుకోవాలనేది తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు. టీడీపీ అంటేనే సంక్షేమం, అభివృద్ధి అని స్పష్టం చేశారు. టీడీపీ గుర్తు సైకిల్ కు సంక్షేమం ఒక చక్రం, అభివృద్ధి మరో చక్రం అని చంద్రబాబు అభివర్ణించారు. వైసీపీ పాలకులు ఏపీని సర్వనాశనం చేశారు... నాడు అద్భుతంగా పురోగమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు పాతాళానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

"భస్మాసుర పాలనలో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వ దోపిడీతో పేదలు మరింత పేదవాళ్లుగా మారారు. సహజ వనరులు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను దోచేస్తూ ఈ సైకో ప్రభుత్వం ప్రజల భవిష్యత్తును చీకటిమయం చేసింది. వైసీపీ మాఫియా రాజ్యంలో ప్రజల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఏపీలో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకే భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో పథకాలు ప్రకటించాను. 

రేపటి నుంచి 45 రోజుల పాటు నేను చేపట్టబోయే కార్యక్రమంలో పథకాల ప్రయోజనాలపై కార్యకర్తలు ప్రజలతో చర్చిస్తారు. మీ సమస్యలపై టీడీపీ కార్యకర్తలతో చర్చించండి. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీతో కలిసి అడుగులు వేయండి. 

దసరా రోజున తెలుగుదేశం పార్టీ పూర్తి మేనిఫెస్టోను ప్రకటిస్తా. అందరి భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతం చేద్దాం. మీ ప్రాంతాలకు వచ్చే కార్యకర్తలకు ప్రజలు సహకరించాలి" అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
Chandrababu
TDP
Open Letter
Andhra Pradesh

More Telugu News