Flex Fuel: ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు... ఆవిష్కరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- ఇన్నోవా హైక్రాస్ మోడల్ కు ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత
- పెట్రోల్ లో ఇథనాల్ కలపడమే ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం
- ఈ కొత్త సాంకేతికతతో మరిన్ని మోడళ్లు రావాలన్న నితిన్ గడ్కరీ
- అన్నదాత ఇప్పుడు ఇంధనదాత అయ్యాడని వెల్లడి
భవిష్యత్ లో చమురు లభ్యత, పర్యావరణం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆవిర్భవించిందే ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత. పెట్రోల్ లో ఇథనాల్ కలిపి ఇంధనంగా ఉపయోగించడమే ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం.
ఈ విధానంలో రూపొందిన తొలి కారును కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు. టయోటా ఇన్నోవా హైక్రాస్ కారుకు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీని అమర్చారు. ఈ కారును బీఎస్-6 స్టేజ్-2 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేశారు. అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలను అందుకునేలా దీన్ని రూపొందించారు.
ఆవిష్కరణ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, బైకులు, ఆటోలు, ఈ-రిక్షాలు వంద శాతం ఇథనాలు వాహనాలుగా మారాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతతో మరిన్ని మోడళ్లు తీసుకురావాలని అభిలషించారు.
ఫ్లెక్స్ ఫ్యూయల్ విధానం వల్ల వ్యవసాయ రంగంలో మరిన్ని ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని వివరించారు. దేశంలో ఇథనాల్ కు గిరాకీ పెరగడం వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతమని, ఇకపై అన్నదాత ఇంధనదాతగా మారతాడని వివరించారు. ఇథనాల్ ను ఆహార ధాన్యాలు, ఆహార పంటల నుంచి తయారుచేస్తారు.