NTR Coin: మింట్ కాంపౌండ్లను షేక్ చేసిన ఎన్టీఆర్ నాణెం విక్రయాలు... రికార్డు బద్దలైంది!

NTR Coins sales breaks record

  • యుగ పురుషుడు ఎన్టీఆర్ ముఖచిత్రంతో రూ.100 నాణేలు
  • ఢిల్లీలో విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • హైదరాబాద్ మింట్ కాంపౌండ్లలో విక్రయాలు
  • ఒక్క రోజులోనే 12 వేల నాణేలు అమ్మకం
  • గతంలో శ్రీకృష్ణ  ప్రభుపాద నాణేలు 10 వేలు అమ్మకం
  • ఇప్పుడా రికార్డును తిరగరాసిన ఎన్టీఆర్ నాణేలు

దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ముఖచిత్రంతో రూపొందించిన రూ.100 నాణేలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆగస్టు 28న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విశిష్ట నాణేలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. 

ఇవాళ (ఆగస్టు 29) హైదరాబాద్ మింట్ కాంపౌండ్ లో ఎన్టీఆర్ నాణేలను అమ్మకానికి పెట్టగా, అదిరిపోయే స్పందన వచ్చింది. సైఫాబాద్ మింట్ కాంపౌండ్ జాయింట్ జనరల్ మేనేజర్ దీనిపై స్పందించారు. 

12 వేల కాయిన్స్ ఒక్క రోజులోనే అయిపోయాయని వెల్లడించారు. ఓ వ్యక్తి గౌరవార్థం ముద్రించిన నాణేలు ఈ స్థాయిలో అమ్ముడవడం ఇదే ప్రథమం అని తెలిపారు. శ్రీకృష్ణ ప్రభుపాద పేరిట రూపొందించిన నాణేలు 10 వేలు అమ్ముడయ్యాయని, ఇప్పుడా రికార్డును ఎన్టీఆర్ నాణేలు ఒక్కరోజులోనే తిరగరాశాయని వివరించారు. 

ఎన్టీఆర్ నాణేలకు లభిస్తున్న డిమాండ్ చూస్తుంటే మరో 20 వేల నాణేలు కూడా సరిపోయేట్టు లేవని జాయింట్ జనరల్ మేనేజర్ అన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే లక్ష నాణేలు అవసరమనిపిస్తోందని తెలిపారు. 

డిమాండ్ ఉన్నంతవరకు తాము నాణేల విక్రయం కొనసాగిస్తామని, దీనికి పరిమితులు అంటూ ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయని వెల్లడించారు.

NTR Coin
Sales
Record
Mint
Hyderabad
  • Loading...

More Telugu News