python: ప్రపంచంలోనే తొలిసారి... మహిళ మెదడులో బతికున్న 8 సెం.మీ. పరాన్నజీవి
- 64 ఏళ్ల మహిళ మెదడు నుండి ఎలికపామును గుర్తించిన వైద్యులు
- మెదడులో ఈ పరాన్నజీవి ఉంటుందని ఊహించలేదన్న వైద్యులు
- ఆకుకూరల ద్వారా వెళ్లి ఉంటుందంటున్న వైద్యులు, శాస్త్రవేత్తలు
64 ఏళ్ల ఓ మహిళ మెదడులో 8 సెంటిమీటర్ల పరాన్నజీవి (ఏలికపాము)ని గుర్తించి బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత కూడా అది బతికే ఉంది. ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా ఆసుపత్రిలో జరిగింది. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు చెందిన మహిళ మొదట పొత్తి కడుపులో నొప్పి, ఆ తర్వాత డయేరియోతో బాధపడుతూ జనవరి 2021లో స్థానిక ఆసుపత్రిలో చేరింది. 2022 నాటికి ఆమెలో క్రమంగా మతిమరుపు రావడం, కుంగుబాటు వంటివి కనిపించాయి. ఆ తర్వాత కాన్‌బెర్రా ఆసుపత్రికి తరలించారు.
ఆమె మెదడును స్కాన్ చేసిన వైద్యులు అసాధారణ స్థితిని గుర్తించారు. దాంతో వైద్యులు సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఆశ్చర్యకరంగా ఆమె మెదడు నుండి ఓ 8 సెంటీమీటర్ల పరాన్నజీవి (ఏలికపాము)ని బయటకు తీశారు. సర్జరీకి ముందు మెదడులో ఈ పరాన్నజీవి ఉంటుందని తాము భావించలేదని, అది కూడా బతికే ఉంటుందని తమలో ఎవరూ అనుకోలేదని ఆపరేషన్ నిర్వహించిన న్యూరో సర్జన్ డాక్టర్ హరిప్రియా బండి, అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు డాక్టర్ సంజయ సేననాయకే తెలిపారు. ఆ తర్వాత దానిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తీసుకు వెళ్లారు.
తమకు తెలిసినంత వరకు మానవ లేదా ఇతర రకాల క్షీరజాతుల మెదడులో ఉన్న మొదటి పరాన్నజీవిగా దీనిని తాము గుర్తించినట్లు సేననాయకే తెలిపారు. తమ వైద్య వృత్తిలో మొదటిసారి ఇలాంటి దానిని చూశామన్నారు. మెదడులో ఈ పరాన్నజీవిని కలిగి వున్న 64 ఏళ్ల మహిళ న్యూసౌత్ వేల్స్ లోని కార్పెట్ పైథాన్‌లు నివసించే సరస్సు ప్రాంతానికి సమీపంలో ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆమెకు సరీసృపాలతో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ ఆమె తిన్న ఆకుకూరలు లేదా ఇతర కూరగాయల ద్వారా అది వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏదైనా కార్పెట్ పైథాన్ మలవిసర్జితం ద్వారా పరాన్నజీవి గుడ్లు ఆకుకూరల్లోకి వ్యాప్తి చెంది ఉండవచ్చునని, అలా వెళ్లి ఉండే అవకాశముందని డాక్టర్లు, సైంటిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.