High Cholesterol: వినికిడి లోపమా... ఇది దేనికి సంకేతమో తెలుసా...?
- హై కొలెస్ట్రాల్ తో రక్త నాళాలు మూసుకుపోయే అవకాశం
- చెవి లోపలి భాగాలకు తగ్గిపోయే రక్త ప్రసరణ
- రక్తం అందక దెబ్బతినే చెవి లోపలి భాగాలు
గుండె సంబంధిత వైఫల్యాలకు దారితీసే హై కొలెస్ట్రాల్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే అది ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంలో హైకొలెస్ట్రాల్ పెరుగుదల చాలావరకు నిశ్శబ్దంగానే సాగుతుంది.
పైకి పెద్దగా లక్షణాలేవీ కనిపించకపోవడంతో దీన్ని గుర్తించడం చాలా కష్టం. హార్ట్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ సంభవించేంత వరకు తాము హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నట్టు వారికి తెలియదు. అందుకే హై కొలెస్ట్రాల్ ను సైలెంట్ కిల్లర్ అంటుంటారు.
అయితే, కొన్ని లక్షణాలు హై కొలెస్ట్రాల్ ను సూచిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది వినికిడి లోపం. హై కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారిలో చెవులు సరిగా వినపడవు. సరిగా వినిపించకపోతుంటే అది హై కొలెస్ట్రాల్ లక్షణంగా అనుమానించాల్సిందే. వ్యక్తులు హై కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే క్రమంగా వారి రెండు చెవులకు వినికిడి శక్తి లోపిస్తుంది. తగిన చికిత్స తీసుకోకపోతే పూర్తిగా వినికిడి సామర్థ్యం కోల్పోతారు.
హై కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాలు క్రమంగా కుచించుకుపోతాయి. ఆరోగ్యకరమైన రక్త ప్రసరణకు ఆటంకాలు ఏర్పడతాయి. దాంతో చెవులు సజావుగా పనిచేసేందుకు అవసరమైన రక్తం అందదు. సరైన రక్తప్రసరణ లోపించడంతో చెవి లోపలి సున్నితమైన భాగాలు దెబ్బతింటాయి.
వైద్య పరీక్షల్లో కొలెస్ట్రాల్ ఉందని తేలితే జీవనశైలిని మార్చుకోవడం అత్యవసరం. తద్వారా హై కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవడమే కాకుండా, వినికిడి శక్తిని పునరుద్ధరించుకోవచ్చు.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కలిగివున్న వారు కేకులు, బిస్కట్లు, మీట్ స్టఫ్డ్ పీస్, సాసేజ్ లు, కొవ్వుతో కూడిన మాంసం తినడం ఆపేయాలి. ముఖ్యంగా, కొబ్బరినూనె, పామాయిల్ తో చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ కొనుగోలు చేస్తే, అందులో ఉపయోగించిన దినుసుల జాబితాను ఓసారి చూసుకోవాలి. బటర్, నెయ్యి, మీగడ, ఛీజ్ వంటి పదార్థాలకు నో చెప్పాలి.