manikrao thakre: షర్మిల పార్టీలో చేరే అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుంది: మాణిక్‌రావు ఠాక్రే
- సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తామన్న ఠాక్రే
- కీలక హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇస్తామని వెల్లడి
- ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇద్దరు బీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని హామీ
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తమ పార్టీలో చేరే అంశాన్ని అధిష్ఠానం చూసుకుంటుందని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... తాము వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కీలక హామీలపై ప్రజలకు గ్యారెంటీ కార్డు ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డు తీసుకు వెళ్తామన్నారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఇద్దరు బీసీలకు తాము ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ రేపు సాయంత్రం నాలుగు గంటలకు భేటీ కానుంది. ఇటీవలి వరకు పోటీ చేసే ఆశావహుల దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ జాబితాను పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేసే దిశగా అడుగులు వేయనుంది. సర్వేల ఆధారంగా, సామాజిక కోణం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అభ్యర్థుల జాబితాను పరిశీలించి, స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేస్తుంది. సెప్టెంబర్ మూడో వారంలో అభ్యర్థుల ప్రకటన ఉండవచ్చునని తెలుస్తోంది.