Electricity dept: ఏసీబీ అధికారులను చూసి పరుగులు పెట్టిన లంచగొండి అధికారి.. ఏపీలో ఘటన

Electricity Asst Engineer Ran away after seeing ACB Officers in Andrapradesh

  • వెంటపడ్డ ఏసీబీ సీఐని కారుతో ఢీ కొట్టిన వైనం
  • లంచం సొమ్మును పొలంలో విసిరేసి పరారైన విద్యుత్ శాఖ ఏఈ
  • పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో ఘటన

అన్నదాతను లంచం కోసం వేధించిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు రాత్రిపూట దొంగలాగా పరుగెత్తాడు.. పొలంలో పడుతూ లేస్తూ కాళ్లకు బుద్ధి చెప్పాడు. ముచ్చటపడి కొనుక్కున్న కారును పొలంలో వదిలేసి.. కొద్ది క్షణాల క్రితం తీసుకున్న లంచం సొమ్మును పారేసి పరారయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం..

జిల్లాలోని ములక్కాయవలస గ్రామానికి చెందిన రైతు డి.ఈశ్వరరావు తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈ శాంతారావును ఆశ్రయించారు. ఇందుకు శాంతారావు రూ.60 వేలు లంచం డిమాండ్ చేశాడు. దరఖాస్తు కోసం రూ.4 వేలు ఫోన్ పే చేసిన ఈశ్వరరావు.. అడ్వాన్స్ గా రూ.20 వేలు శాంతారావుకు ముట్టజెప్పాడు. మిగతా సొమ్ము కూడా ఇస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తానంటూ తేల్చి చెప్పాడు. దీంతో ఈశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచనల ప్రకారం ఏఈ శాంతారావును తన పొలం వద్దకు పిలిచి మిగతా రూ.40 వేలు అందజేశాడు.

ప్లాన్ ప్రకారం ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు, సీఐ టి.శ్రీనివాసరావులు బైక్ పై అక్కడికి చేరుకున్నారు. కారులో కూర్చుని డబ్బులు లెక్కపెట్టుకుంటున్న కాంతారావు ఏసీబీ అధికారులను చూసి కంగుతిన్నాడు. చేతిలో సొమ్మును బయటకు విసిరేసి, కారును స్టార్ట్ చేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. బైక్ పై వెంబడించిన సీఐ శ్రీనివాసరావును ఢీ కొట్టి కారును పొలంలోకి మళ్లించాడు. పొలంలో కారు ఆగడంతో కిందకు దిగి కాళ్లకు బుద్ది చెప్పాడు. కారు ఢీ కొట్టడంతో కిందపడ్డ ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చేర్పించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏఈ శాంతారావును వెంటనే లొంగిపోవాల్సిందిగా సూచించాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈకి ఫోన్ లో సమాచారం అందించామన్నారు.

  • Loading...

More Telugu News