Manohar lal Khattar: శోభ యాత్ర ఎందుకు? దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయండి: హర్యానా సీఎం

ML Khattar suggest people to offer prayers at temple After No Permission For Nuh Rally

  • నూహ్ జిల్లాలో ఘటనల దృష్ట్యా శాంతిభద్రతలు కాపాడటం ప్రభుత్వ బాధ్యతన్న సీఎం 
  • ప్రభుత్వ నిషేధాజ్ఞలు తోసిరాజని నేడు శోభయాత్రకు పిలుపునిచ్చిన సంస్థలు
  • మతపరమైన యాత్రలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్న విశ్వహిందూ పరిషత్
  • ఈ నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

హర్యానాలోని నూహ్ జిల్లాలో విశ్వ హిందూ పరిషత్ చేపట్టదలిచిన శోభ యాత్రకు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం కీలక వ్యాఖ్యల చేశారు. గతనెలలో నూహ్ జిల్లాలో జరిగిన ఘటన దృష్ట్యా అక్కడ శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. ఇది శ్రావణ మాసం కావడంతో ప్రజలు యాత్రకు బదులు సమీపంలోని గుళ్లకు వెళ్లి ప్రార్థనలు చేయాలని సూచించారు. 

అయితే, ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ గుళ్లల్లో జలాభిషేకాలకు ప్రభుత్వం అనుమతించినట్టు సీఎం పేర్కొన్నారు. ‘‘ఇది శ్రావణ మాసం కాబట్టి ప్రతిఒక్కరూ గుళ్లల్లో జలాభిషేకాలు చేసుకోవచ్చు’’ అని చెప్పారు. నూహ్ జిల్లాలో సెక్షన్ 144 విధించినట్టు హర్యానా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. జిల్లాలో లా అండ్ ఆర్డర్ నెలకొల్పేందుకు బ్రజ్‌మండల్ శోభయాత్రకు అనుమతి నిరాకరించినట్టు పేర్కొంది.

మరోవైపు, ప్రభుత్వ నిషేధాజ్ఞలను తోసిరాజని జిల్లాలో నేడు యాత్ర నిర్వహించాలంటూ సర్వ జయతి హిందూ మహాపంచాయత్ పిలుపు నివ్వడంతో పోలీసులు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మతపరమైన యాత్రలకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని విశ్వహిందూ పరిషత్ కూడా వ్యాఖ్యానించింది.

More Telugu News