Nambi Narayanan: గత ప్రభుత్వాలకు ఇస్రోపై నమ్మకం ఉండేది కాదు: మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్
- కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదట్లో ఇస్రోకు సరిపడా నిధులు మంజూరు చేయలేదన్న నంబి నారాయణన్
- ఇస్రో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాకే పరిస్థితి మారిందని వ్యాఖ్య
- ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలు సమయానికి అందట్లేదన్న వార్తలను ఖండించిన నంబి
- చంద్రయాన్-3 వంటి జాతీయ ప్రాజెక్టు ఘనత ప్రధానికే దక్కుతుందని స్పష్టీకరణ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థపై (ఇస్రో) గత ప్రభుత్వాలకు మొదట్లో నమ్మకం ఉండేది కాదని ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇస్రో తొలినాళ్లల్లో కావాల్సిన మేరకు నిధులు మంజూరు చేసేవి కావని పేర్కొన్నారు. ఇస్రో ఏర్పడిన నాటి రోజుల గురించి తాజాగా ఓ మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ కూడా తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేసింది.
న్యూ ఇండియన్ అనే మీడియా సంస్థతో నంబి నారాయాణ మాట్లాడుతూ..‘‘మాకు అప్పట్లో ఓ జీప్ లేదు.. కనీసం ఓ కారు కూడా ఉండేది కాదు. అసలేమీ ఉండేది కాదు. అంటే.. మాకు కావాల్సినంత నిధులు మంజూరు అయ్యేవి కావు. ఇస్రో తొలి నాళ్లల్లో పరిస్థితి అలా ఉండేది. ఈ విషయంలో నేనేమీ ఫిర్యాదు చేయట్లేదు కానీ వాళ్లకు(ప్రభుత్వానికి) ఇస్రోపై నమ్మకం ఉండేది కాదు’’ అని వ్యాఖ్యానించారు. ఇస్రో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాకే పరిస్థితుల్లో మార్చు వచ్చిందని వ్యాఖ్యానించారు.
చంద్రయాన్ విజయానికి తాను కారణమని చూపించుకునేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ ఆరోపణలపై కూడా నంబి నారాయణన్ స్పందించారు. చంద్రయాన్-3 వంటి జాతీయ స్థాయి ప్రాజెక్టు విజయానికి ఘనత ప్రధానికి తప్ప మరెవరికి దక్కుతుందని ప్రశ్నించారు. ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలు సమయానికి అందట్లేదన్న వార్తలను కూడా ఆయన ఖండించారు. తన పెన్షన్ నెలనెలా 29నే ఠంచనుగా తన అకౌంట్లో పడుతుందని చెప్పుకొచ్చారు.