Ram Shila: గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి.. చూసేందుకు పోటెత్తుతున్న జనం

Floating stone that found in river ganga in Bihar Patna
  • బీహార్ రాజధాని పాట్నాలో ఘటన
  • రాయిపై శ్రీరామ్ అని చెక్కివుండడంతో పూజలు
  • పూజలు చేస్తున్న భక్తులు
  • రాయి దొరికిన రాజ్‌ఘాట్ పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని డిమాండ్
గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి రామసేతులోని రాయేనంటూ ప్రచారం జరుగుతోంది. రాయి దొరికిన ప్రాంతం పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని ప్రజలు డిమాండ్ కూడా చేస్తున్నారు. బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగిందీ ఘటన. ఇక్కడి రాజ్‌ఘాట్ సమీపంలో గంగానదిలో తేలుతూ వస్తున్న రాయిని గమనించిన స్థానికులు ఆశ్చర్యపోయి దానిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు. రాయిపై ‘శ్రీరామ్’ అని రాసి ఉండడంతో అది రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన శిలేనని భావిస్తూ ఓ నీటితొట్టెలో ఉంచి పూజలు చేస్తున్నారు. విషయం తెలిసిన జనం ఆ రాయిని చూసేందుకు పోటెత్తుతున్నారు. 

గంగానదిలో రాళ్లు తేలియాడుతూ కొట్టుకురావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మూడురాళ్లు లభ్యమయ్యాయి. వాటిలో ఒకటి పాట్నాలోని హనుమాన్ ఆలయంలో, మరోటి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో, ఇంకోటి పాట్నాలోని పఠాన్‌దేవి ఆలయంలో ప్రతిష్ఠించారు. తాజాగా కనిపించిన రాయి నాలుగోది. 

తాజాగా, తేలియాడుతూ వచ్చిన రాయి బరువు 9 కిలోలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. తర్వాత మరోమారు దానిని తూకం వేస్తే 14 కిలోలకు పెరిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నీళ్లలో వేస్తే మాత్రం అది తేలుతోందని చెప్పారు. గతంలో ఇక్కడ ఇదే రోజుల్లో ఇదే ఘాట్‌పై బంగారు రంగు తాబేలు కనిపించిందని, దానిని తిరిగి నదిలోనే విడిచిపెట్టామని వివరించారు.
Ram Shila
Patna
Bihar
River Ganga
Jai Shri Ram
Ram Setu

More Telugu News