Asia cup 2023: యోయో టెస్టులో కోహ్లీ కంటే ముందున్న యువ ప్లేయర్
- ఫిట్ నెస్ టెస్టులో టాపర్ గా శుభ్ మాన్ గిల్
- కోహ్లీ స్కోరు 17.2 కాగా గిల్ స్కోరు 18.7 పాయింట్లు
- ఆసియా కప్ కు సిద్దమవుతున్న టీమిండియా
టీమిండియా ఆటగాళ్లలో యువ ప్లేయర్ శుభ్ మాన్ గిల్ అత్యంత ఫిట్ నెస్ తో ఉన్నాడని తాజా టెస్టు రిజల్టులో వెల్లడైంది. ఇటీవల జరిగిన యోయో టెస్టులో గిల్ అత్యధిక పాయింట్లు సాధించి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నా ముందు నిలిచాడు. ఆసియా కప్ టోర్నీ కోసం సిద్దమవుతున్న ఆటగాళ్లు ఇటీవల యోయో టెస్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో 17.2 పాయింట్లు స్కోర్ చేసినట్లు కోహ్లీ సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు.
కర్ణాటక ఆలూర్ లోని స్టేట్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన క్యాంప్ లో ప్లేయర్లకు ప్రాక్టీస్ సెషన్ జరుగుతోంది. ఈ సెషన్ కు హాజరయ్యే ముందు ఆటగాళ్లంతా యోయో టెస్టుకు వెళ్లారు. ఇందులో యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ 18.7 పాయింట్లు స్కోర్ చేసి మిగతా ఆటగాళ్లకంటే ముందు నిలిచాడు. ఈ ఫిట్ నెస్ పరీక్షకు హాజరైన ఆటగాళ్లందరూ కటాఫ్ పాయింట్లు 16.5 దాటారని అధికారులు తెలిపారు. కాగా, ఈ టెస్టుకు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ధ్ కృష్ణ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ హాజరుకాలేదు.