Tomato prices: కిలో రూ.10 కి పడిపోయిన టమాటా ధరలు.. ఆన్నదాతల ఆందోళన

Tomato prices are easing in Andhra Pradesh

  • రెండు నెలల తర్వాత దిగొచ్చిన ధర
  • పెరిగిన దిగుబడి.. మార్కెట్లలో టన్నుల కొద్దీ టమాటాలు
  • సెప్టెంబర్ రెండో వారానికి కిలో రూ.30 కి చేరొచ్చని అంచనా

నిన్న మొన్నటి వరకు చుక్కలనంటిన టమాటాల ధరలు నేడు పాతాళానికి పడిపోయాయి. దిగుబడి పెరగడంతో రైతులు టన్నులకొద్దీ టమాటాలను మార్కెట్లకు తీసుకొస్తున్నారు. దీంతో రేటు పెద్దగా పలకడంలేదు. ఇలా ఒక్కసారిగా రేటు తగ్గడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు నెలల తర్వాత టమాటాల ధరలు దిగొచ్చాయి.

కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోళ్లు శుక్రవారం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. మొదటి రోజే రైతులు పెద్ద సంఖ్యలో సరుకు తీసుకొచ్చారు. దాదాపు 10 టన్నుల టమాటాలు మార్కెట్ కు వచ్చాయని మార్కెట్ యార్డ్ అధికారులు తెలిపారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టమాటా దిగుబడి పెరిగిందని చెప్పారు. ఫలితంగా మార్కెట్లోకి పెద్దమొత్తంలో టమాటా వస్తోందని, ఇది ధరల పతనానికి దారితీసిందని వివరించారు.

క్వింటాల్ టమాటాకు రూ.వెయ్యిలోపే ధర పలికింది. అంటే.. కిలో టమాటా రూ.10 మాత్రమే. ఇటీవలి కాలంలో కిలో టమాటా దాదాపు రూ.300 దాకా చేరగా.. శుక్రవారం కిలో రూ.10 కి పడిపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకు కూడా గిట్టుబాటు కాదని చెప్పారు. కాగా, బహిరంగ మార్కెట్లో వినియోగదారులు మాత్రం టమాటాలకు కిలో రూ.30 నుంచి రూ.40 మధ్యలో చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

More Telugu News