Muslim Student: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం.. హిందూ విద్యార్థులతో ముస్లిం కుర్రాడి చెంపలు పగలగొట్టించిన ఉపాధ్యాయురాలు
- తోటి విద్యార్థుల్లో సహచర విద్యార్థిపై ద్వేషం నింపిన వైనం
- ముస్లిం పిల్లలందరూ.. అంటూ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు
- స్కూలు నుంచి కుమారుడిని తెచ్చేసిన తండ్రి
- వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి
- విచారణకు ఆదేశించిన పోలీసులు, విద్యాశాఖ
ఆమె ఉపాధ్యాయురాలు. పిల్లలందరినీ సమానంగా చూస్తూ విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు స్థానంలో ఉన్న వ్యక్తి. కానీ, ఆమె కూడా మతవివక్ష ప్రదర్శించారు. విద్యార్థుల్లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. తన తరగతిలోని ముస్లిం విద్యార్థిపై చేయిచేసుకున్నారు. అక్కడితో ఆగక సహచర విద్యార్థుల చేత ఆ కుర్రాడి చెంపలు పగలగొట్టించారు.
‘‘కడుపులో కొట్టండి.. చెంప పగలగొట్టండి.. నడుములో గుద్దండి.. గట్టిగా..’’ అంటూ అభంశుభం తెలియని చిన్నారులను ప్రోత్సహించారు. స్నేహితుడిపైనే ద్వేషం రగిల్చారు. చిన్నారులను ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తూ క్లాసులోని అందరిచేతా ముస్లిం బాలుడిని కొట్టించారు. బాధిత చిన్నారి ఏడుస్తున్నా కనికరించలేదు. ముజఫర్‌నగర్‌లోని ఖబర్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన పోలీసులు విచారణకు ఆదేశించారు. ‘‘ముస్లిం పిల్లలందరూ.. ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కెమెరాలో రికార్డయింది.
ఈ ఘటనపై బాధిత విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. తన కుమారుడిని స్కూలు నుంచి తెచ్చేశాననీ, ఈ విషయంపై ఫిర్యాదు చేయకుండా స్కూలు యాజమాన్యం తనతో అగ్రిమెంటు చేసుకుందని, అందులో భాగంగా అడ్మిషన్ ఫీజు మొత్తం వెనక్కి ఇచ్చిందని చెప్పారు. అయితే, వీడియో వైరల్ కావడంతో మన్సూర్‌పూర్ ఎస్పీ సత్యనారాయణ్ ప్రజాపత్ మాట్లాడుతూ.. తాను స్కూలు ప్రిన్సిపాల్‌తో మాట్లాడానని, వైరల్ వీడియోపై విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
ఎక్కాలను గుర్తుపెట్టుకోని కారణంగా సదరు బాలుడిని విద్యార్థులతో కొట్టించినట్టు తెలుస్తోందని, వైరల్ అయిన వీడియోలో ఉపాధ్యాయురాలు చేసిన అసభ్య కామెంట్లు కూడా రికార్డయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖకు కూడా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలు, స్కూలు మేనేజ్‌మెంట్‌పై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రాథమిక విద్యాశాఖ తెలిపింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి