Vladimir Putin: భారత్ లో జరగనున్న జీ-20 సదస్సుకు పుతిన్ దూరం... ఎందుకంటే...!
- ఈ ఏడాది సెప్టెంబరులో భారత్ లో జీ-20 శిఖరాగ్ర సమావేశాలు
- పుతిన్ భారత్ రావడంలేదన్న రష్యా అధ్యక్ష భవనం
- పుతిన్ దృష్టి సైనిక చర్యపైనే ఉందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి వెల్లడి
- పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీ-20 సదస్సుకు హాజరయ్యే అవకాశం
- బ్రిక్స్ సదస్సులోనూ ఇలాగే వీడియో లింక్ ద్వారా పాల్గొన్న రష్యా అధినేత
ఈ ఏడాది జీ-20 దేశాల సదస్సు నిర్వహణ, గ్రూప్ అధ్యక్ష బాధ్యతలు భారత్ కు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో పలు చోట్ల జీ-20 సన్నాహక సదస్సులు నిర్వహించారు. కాగా, జీ-20 దేశాల ప్రధాన సదస్సు వచ్చే నెలలో జరగనుండగా, ఈ కీలక సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూరంగా ఉండనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు పుతిన్ హాజరుకాబోవడంలేదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పుతిన్ భారత్ కు రావడంలేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అయితే, ఈ సదస్సుకు పుతిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యే అవకాశాలున్నట్టు పరోక్షంగా వెల్లడించారు. జీ-20 సదస్సుకు పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకాబోవడంలేదని పెస్కోవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్ మీద సైనిక చర్యపైనే రష్యా అధినాయకత్వం దృష్టి కేంద్రీకరించిందని వివరించారు.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలయ్యాక పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్లడంలేదన్న సంగతి తెలిసిందే. అందుకు బలమైన కారణం ఉంది. ఉక్రెయిన్ పై యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం పుతిన్ పై వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ తో పుతిన్ ను విదేశాల్లో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
ఈ కారణంగానే ఆయన బ్రిక్స్ సమావేశాల కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు రాలేదు. బ్రిక్స్ సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ విధానంలో హాజరయ్యారు. 2022లో ఇండోనేషియాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు కూడా పుతిన్ దూరంగానే ఉన్నారు.