- ఆసియా కప్ స్క్వాడ్ ఎంపిక పట్ల సంతృప్తి
- పరిస్థితులు, సందర్భాలపై విజయం ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం
- చాహల్ కు ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయన్న గంగూలీ
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందని ద్రాక్షలా మారిపోయిందనే విమర్శలు ఎప్పటి నుంచో వింటున్నాం. ధోనీ నాయకత్వంలో భారత్ చివరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. ఈ విడత ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమిస్తుండడంతో టీమిండియాపై అభిమానుల్లో ఆశలు, అంచనాలు పెరిగాయి. దీనిపై బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
‘‘అన్ని సందర్భాల్లోనూ ప్రపంచ కప్ లను గెలవలేం. కొన్ని సమయాల్లో లోపాలు ఉంటాయి. కొన్ని కలసిరాని సందర్భాలు ఉంటాయి’’ అని గంగూలీ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ‘‘వారు గొప్పగా బ్యాటింగ్ చేయాలి. వారు చక్కగా ఆడితే విజయం సాధిస్తారు. ప్రపంచకప్ వేరు, ఆసియా కప్ వేరు. ఆస్ట్రేలియాలో హోమ్ సిరీస్ వేర్వేరు. ఆ సమయంలో వారు ఎలా ఆడుతున్నారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. భారత్ బలంగానే ఉంది. ప్రపంకప్ లో మాత్రం బాగా ఆడాలి’’ అని గంగూలీ తన అభిప్రాయాలను షేర్ చేశారు.
ఆసియా కప్ కు ఎంపిక చేసిన స్క్వాడ్ పై స్పందిస్తూ.. యజ్వేంద్ర చాహల్ ప్రపంచకప్ కు తిరిగి వచ్చే అవకాశాలు ఇప్పటికీ ఉన్నట్టు చెప్పారు. చాహల్ కంటే అక్సర్ పటేల్ కు ఆసియా కప్ లో చోటివ్వడం పట్ల గంగూలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్ ను కూడా చూసి (అక్సర్ పటేల్ ఆల్ రౌండర్) అక్సర్ పటేల్ కు చాన్స్ ఇచ్చి ఉంటారని పేర్కొన్నాడు. దీన్ని మంచి ఎంపికగా అభిప్రాయపడ్డాడు. దీంతో ఆసియా కప్ సెలక్షన్ పై వస్తున్న విమర్శలు ఇప్పటికైనా ఆగుతాయేమో చూడాలి.