Tummala Nageswara Rao: 2 వేల కార్లతో ఖమ్మం జిల్లాకు తుమ్మల.. రాజకీయ భవితవ్యంపై నిర్ణయం?

Tummala Nageswara Rao to visit Khammam today

  • పాలేరు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో తుమ్మల
  • హైదరాబాద్‌ నుంచి ఖమ్మం బయల్దేరే ముందు భావోద్వేగం
  • అనుచరులను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి
  • నాయకన్ గూడెం దగ్గర ఘన స్వాగతం పలికిన అనుచరులు

బీఆర్ఎస్ నుంచి పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మం బయల్దేరే ముందు తన అనుచరులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత తన అనుచరులతో కలిసి 2 వేల కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో ఆయన వెళ్లారు.  

నాయకన్ గూడెం దగ్గర తమ నేతకు అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఎక్కడా బీఆర్ఎస్, కేసీఆర్ జెండాలు లేకుండా, కేవలం తుమ్మల ఫొటోలు, ఫ్లెక్సీలనే పెట్టారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేపట్టారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్తారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని తుమ్మల.. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Tummala Nageswara Rao
Khammam
BRS
paleru
Congress

More Telugu News