- మొక్కల ఆధారిత ఆహారానికి ప్రాధాన్యం
- కూరగాయలు, పండ్లు తీసుకోవాలి
- ఉప్పు, చక్కెర తగ్గించేయాలి
- తగినంత నిద్ర, స్నేహితులతో గడపడం ముఖ్యం
ఉన్నంత కాలం ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యమే ఉంటే దీర్ఘకాలం పాటు నిశ్చింతగా జీవించొచ్చు. ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి మధ్య అనుబంధం ఉంది. అందుకే ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలి. హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. మెడిటేరియన్ జీవన విధానాన్ని ఆచరించే వారికి ముందస్తు మరణం ముప్పు తగ్గుతున్నట్టు ప్రకటించారు.
మెడిటేరియన్ లైఫ్ స్టయిల్ అంటే.. మొక్కల ఆధారిత ఆహారానికే పరిమితం కావడం. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం, ఇతరులతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించడం. శారీరక చర్యలు ఉండేలా చూసుకోవడం. పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలతోకూడిన ఆహారం తీసుకోవడం. ఈ విధానంలో ఉప్పు, చక్కెరలు గణనీయంగా తగ్గించేయాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.
1,10,799 మంది జీవన అలవాట్లను పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్ లో ఈ అధ్యయనం జరిగింది. తీసుకుంటున్న ఆహారం ఎలా ఉంటుంది? జీవనశైలిపై ప్రశ్నలు వేసి సమాధానాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా మూడు విభాగాలుగా వర్గీకరించి, వాటిపై ప్రశ్నలు సంధించారు. పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలతో కూడిన ఆహారం. శారీరకరంగా శ్రమిస్తూ, తగినంత నిద్ర పోవడం, స్నేహితులతో గడపడం, ఉప్పు, చక్కెరలు తగ్గించడం గురించి తెలుసుకున్నారు.
తొమ్మిదేళ్ల తర్వాత గమనిస్తే, 4,247 మంది మరణించారు. ఒక్క కేన్సర్ వల్లే 2,401 మంది ముందస్తుగా ప్రాణాలు కోల్పోతే, 731 మందిని గుండె జబ్బులు బలి తీసుకున్నాయి. మెడిటేరియన్ లైఫ్ స్టయిల్ అనుసరించే విషయంలో మంచి స్కోరు ఉన్న వారికి మరణ ముప్పు 29 శాతం తక్కువగా ఉంటోందని పరిశోధకులు గుర్తించారు. ఇదేదో బావుందని చెప్పి వెంటనే మెడిటేరియన్ డైట్ ప్రారంభించకండి. పోషకాహార నిపుణులను సంప్రదించిన తర్వాతే, తమకు అనుకూలమైన విధంగా మెనూను అనుసరించడం మంచిది.