Anand Mahindra: పేద దేశం భారత్ అంతరిక్ష పరిశోధనలకు ఇంత ఖర్చు చేయాలా అన్న బీబీసీ... దీటుగా బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా!

Anand Mahindra strong reply to BBC channel remarks on Chandrayaan 3

  • చంద్రయాన్-3తో అంతరిక్ష సూపర్ పవర్ గా భారత్
  • విమర్శనాత్మకంగా స్పందించిన బీబీసీ చానల్
  • పేదరికంతో కొట్టుమిట్టాడే భారత్ కు ఇంత ఆర్భాటమెందుకన్న బీబీసీ
  • మీ వల్లే మేం పేదవాళ్లమయ్యాంటూ వలస రాజ్య పాలనపై మండిపడిన ఆనంద్ మహీంద్రా

చంద్రయాన్-3తో చారిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకోగా, విదేశీ మీడియా సంస్థల్లో కొన్ని భారత్ ను పొగిడినట్టే పొగిడి, అదే నోటితో విమర్శించాయి. అలాంటి మీడియా సంస్థల్లో బీబీసీ ఒకటి. 

తన పత్రికలో ఆహా ఓహో అన్న ఈ బ్రిటన్ మీడియా దిగ్గజం... తన చానల్లో మాత్రం భారత్ పై అక్కసు వెళ్లగక్కింది. "మౌలిక సదుపాయాలు లేకుండా, దుర్భర దారిద్ర్యంతో కొట్టుమిట్టాడుతున్న భారత్... అంతరిక్ష పరిశోధల కోసం ఇంత ఖర్చు చేయడం అవసరమా?" అని బీబీసీ చానల్ పేర్కొన్నట్టు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. 

దీనిపై భారత పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా దీటుగా స్పందించారు. "బీబీసీ చెప్పింది నిజమా... అయితే ఈ వాస్తవం వినండి! దశాబ్దాల వలస పాలనే మా పేదరికానికి కారణం. ఓ క్రమపద్ధతిలో యావత్ భారత ఉపఖండాన్ని కొల్లగొట్టారు. మా నుంచి దోపిడీకి గురైన అత్యంత విలువైన వస్తువు కోహినూర్ వజ్రం కాదు... మా ఆత్మాభిమానం, స్వీయ సామర్థ్యాలపై మా నమ్మకం... దోపిడీకి గురైంది ఇవీ. మీరు మాకుంటే తక్కువ వారు అని మాతోనే ఒప్పించాలన్నది వలస రాజ్య లక్ష్యం. 

మేం మరుగుదొడ్లలో పెట్టుబడి పెడతాం... అంతరిక్ష యాత్రల్లో కూడా పెట్టుబడి పెడతాం... అదేమీ విరుద్ధమైన పని కాదు సర్ (చానల్ యాంకర్ ను ఉద్దేశించి). చంద్రునిపై అడుగుపెట్టామంటే అది మా ప్రతిష్ఠను, ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సాయపడుతుంది కాబట్టి. శాస్త్ర విజ్ఞానం ద్వారా మేం పురోగతి సాధించగలం అనే నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది. పేదరికం నుంచి మమ్మల్ని మేం బయటపడేసుకోగలమన్న ఆశను ఇది కలిగిస్తుంది. ఆకాంక్ష అనేది లేకపోవడమే అత్యంత పేదరికం" అంటూ ఆనంద్ మహీంద్రా సదరు బ్రిటీష్ మీడియా సంస్థకు చురక అంటించారు.

  • Loading...

More Telugu News