Jagan: ఆంధ్రకేసరికి నివాళి అర్పించిన జగన్, చంద్రబాబు
- టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నేడు
- దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్న జగన్
- తెలుగువారి ఆత్మ స్థైర్యానికి నిలువుటద్దంలా నిలిచారన్న చంద్రబాబు
స్వాతంత్ర్య సమరయోధుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర సీఎంగా, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుడికి పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నివాళి అర్పించారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాష్ట్రానికి, దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని జగన్ కొనియాడారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకమని అన్నారు. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేసిన ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అని ట్వీట్ చేశారు.
తెలుగువారి ఆత్మస్థైర్యానికి నిలువుటద్దంలా నిలిచిన నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని చంద్రబాబు అన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం సమస్తమూ త్యాగం చేసిన దేశభక్తుడు... స్వాతంత్య్రం అనంతరం పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజా సంక్షేమమే ఊపిరిగా బతికిన అసలైన ప్రజా నాయకుడని చెప్పారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించిన రైతు బాంధవుడు ప్రకాశం గారని కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి స్మృతికి నివాళులు అని ట్వీట్ చేశారు.