Ayyanna Patrudu: A2కు రూ.300 కోట్ల భూమిని రూ.20 కోట్లకే కట్టబెట్టడానికి సిద్ధమైన జగన్: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu hot comments on YS Jagan and Vijayasaireddy
  • తుర్లవాడ కొండపై నరసింహస్వామి నడయాడారని అక్కడి ప్రజలు విశ్వసిస్తారన్న మాజీ మంత్రి
  • పవిత్రభూమిని విజయసాయరెడ్డికి దోచిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న అయ్యన్న
  • టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ , విజయసాయిల దోపిడీని నిగ్గుతేలుస్తామని వెల్లడి
  • అధికారంలోకి వచ్చాక తోడు దొంగలిద్దరి బాగోతం ప్రజలముందు పెడతామన్న అయ్యన్న
  • జగన్ పెద్ద ఆర్థిక ఉగ్రవాది, ధనపిశాచి అని ప్రజలు అనుకుంటున్నారని తీవ్రవ్యాఖ్యలు
దోపిడీతో రాష్ట్రానికి, యువతకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ఏపీలో వినాశకర పాలన సాగుతోంటే మేధావులు, విజ్ఞులు, ప్రజాసంఘాలు, ప్రజలు స్పందించకుంటే ఎలాగని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ  జాతీయ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

గత ప్రభుత్వాల్లో సమర్థవంతంగా పనిచేసిన అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జగన్ విధానాలను, ప్రభుత్వ దోపిడీని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే దోపిడీపై ప్రజలందరూ గట్టిగా నిలదీయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఏ2 విజయసాయిరెడ్డికి భీమునిపట్నం ప్రాంతంలో రూ.300 కోట్ల విలువైన తుర్లవాడ కొండభూమిని కట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు.

తుర్లవాడ కొండ ఆ ప్రాంతంలో ఎంతో పవిత్రమైనది, విశేషమైనదన్నారు. ఆ కొండపై దేవుని పాదాలు ఉన్నాయని స్థానిక ప్రజలు విశ్వసిస్తుంటారని, అలాంటి కొండను కబ్జా చేయడానికి విజయసాయిరెడ్డి అతని గ్యాంగ్ సిద్ధమైందన్నారు. రెండ్రోజుల క్రితం ఏ2 కొండను పరిశీలించడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అనుమానం వచ్చిందని, ఆ తర్వాత ప్రభుత్వ సహకారంతో ఆ కొండను కబ్జా చేయడానికి సిద్ధమైనట్లుగా అర్థమైందన్నారు. ఆ కొండపైన విజయసాయిరెడ్డి కూతురు ప్రయివేట్ యూనివర్శిటీ కడుతున్నారని, కాబట్టి దానిపై 120ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారన్నారు. సదరు దరఖాస్తుపై అధికార యంత్రాంగం ఆగమేఘాలపై స్పందించి, చకచకా ఫైల్ సిద్ధం చేసి, ముఖ్యమంత్రి ఎదుట ఉంచిందని మండిపడ్డారు.

రూ.300 కోట్ల విలువైన కొండభూమిని రూ.20 కోట్లకే ఏ2 కట్టబెట్టడానికి జగన్ సిద్ధమయ్యాడన్నారు.
విశాఖపట్నం సమీపంలోని ఆ కొండ భూమి ఎకరం ధర రూ.2 నుంచి రూ.3 కోట్లు ఉంటుందని, 120 ఎకరాలు రూ.300 కోట్ల వరకు విలువ ఉంటే, కేవలం రూ.20 కోట్ల నామమాత్రపు ధరకే జగన్ దాన్ని ఏ2కు కట్టబెట్టడానికి సిద్ధమయ్యాడన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎక్కడా, దేనినీ వదలకుండా దోచుకున్న జగన్ రెడ్డి, అతని అనుమాయులు ఇంకా అక్కడక్కడ మిగిలి ఉన్న ఇలాంటి విలువైన భూములను కూడా కాజేసేందుకు సిద్ధమయ్యారన్నారు. తుర్లవాడ కొండపై నరసింహస్వామి నడయాడారని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారన్నారు. ఈ కొండపై స్వామి విగ్రహ ఏర్పాటుకు స్థానికులు టీటీడీతో గతంలోనే మాట్లాడారన్నారు. అలాంటి పవిత్రమైన కొండను ఏ2కు ధారాదత్తం చేయడానికి సిద్ధపడిన జగన్ రెడ్డికి సిగ్గుందా? అని నిలదీశారు.

విశాఖపట్నంలో విజయసాయి, జగన్ ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారని, ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. రాష్ట్రంలో దాదాపు 40 వేల ఎకరాల దేవాదాయభూమి క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని దేవాదాయశాఖ మంత్రి చెబుతున్నాడని, మంత్రిగా ఉండి రికార్డుల్లో ఉన్నభూమి ఫీల్డ్‌లో లేదని చెప్పడానికి సిగ్గుందా? అన్నారు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములతో పాటు కార్యాలయాలు, వాటి ఆస్తుల్ని తనఖా పెట్టి, రూ.25 వేల కోట్ల అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం, విజయసాయి నేతృత్వంలో భారీగా భూముల్ని దోచేసిందన్నారు.

ప్రభుత్వ ఆస్తులంటే తన తండ్రి సంపాదించిన ఆస్తులని జగన్ భావిస్తున్నాడా? దసపల్లా భూములు, కార్తీక వనం, బేపార్క్, ఎన్.సీ.సీ., రామానాయుడు స్టూడియో, భోగాపురం భూములు అప్పనంగా ప్రజల్ని భయపెట్టి లాక్కున్నారన్నారు. అవన్నీ కలిపితే వాటి విలువ దాదాపు రూ.70 వేల కోట్లు ఉంటుందన్నారు. వాటితో పాటు రుషికొండను స్వాహా చేశారన్నారు. రుషికొండపై ముఖ్యమంత్రి నివాసం కడితే తప్పేముందని మంత్రి రోజా మాట్లాడటం ఆమె బుద్ధి మాంద్యానికి నిదర్శనమన్నారు. రుషికొండ విశాఖపట్నం మహానగరానికి రక్షణ కవచం లాంటిదన్నారు. హుధుద్ తుఫాన్ ప్రభావం గతంలో రుషికొండను తాకి వెనక్కు మళ్లిందని గుర్తు చేశారు. ఆ తుఫాన్ నుంచి విశాఖను రుషికొండే కాపాడిందన్నారు. ఆనాడు రుషికొండ లేకపోతే, విశాఖనగరం మొత్తం సముద్రం పాలయ్యేదన్నారు. అలాంటి కొండపై మా ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకుంటాడని చెప్పడం జబర్దస్త్ రోజాకే చెల్లిందని నిప్పులు చెరిగారు.

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా రుషికొండపై నిర్మాణాలు చేయడం, కోర్టు ఆదేశాలను ధిక్కరించడం ఈ దుర్మార్గపు ప్రభుత్వానికే సరిపోయిందన్నారు. పదవులు, అధికారం ఏవీ శాశ్వతం కాదని పాలకులు గుర్తుంచుకోవాలన్నారు. సీనియర్ మంత్రులైన బొత్స, ధర్మాన వంటి వారు గతంలో ఎన్నోతప్పులు చేశారని, ఇప్పుడు జగన్‌ను, అతని దోపిడీని సమర్థిస్తూ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారన్నారు. విశాఖతో  పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మేథావులు, ప్రజాసంఘాలు స్పందించాలని కోకారు. పాలకుల దుశ్చర్యలను ప్రతిఘటించాలని కోరరు. న్యాయస్థానాలు, ఎన్జీటీని కాదని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి నివాసం ముసుగులో రుషికొండపై నిర్మించే నిర్మాణాలను టీడీపీ ప్రభుత్వం రాగానే  ప్రజావసరాలకు, పర్యాటకశాఖకు కేటాయిస్తామన్నారు.  అలానే  విజయసాయిరెడ్డి, జగన్‌ల దోపిడీని ఆధారాలతోసహా ప్రజలముందు ఉంచుతామన్నారు.

విజయసాయి, జగన్ ఇద్దరూ తోడుదొంగలని తీవ్రవ్యాఖ్యలు చేశారు. జగన్ పెద్ద ఆర్థిక ఉగ్రవాది అని, ధన పిశాచి అని ప్రజలు అంటున్నారన్నారు. విజయసాయి, జగన్ ఇద్దరూ గతంలో ఏ స్థాయిలో ప్రజల సొమ్ము కాజేశారో అందరికీ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్, విజయసాయిరెడ్డి కలిసి ఎంత దోచారో, ఎన్నివేల ఎకరాల భూములు దిగమింగారో అంతా బయటపెట్టి, ఇద్దరు తోడుదొంగల్ని తాము అధికారంలోకి వచ్చాక శిక్షిస్తామన్నారు. లక్షల కోట్ల సంపదను ఏం చేసుకుంటాడో జగన్ సమాధానం చెప్పాలన్నారు. తండ్రి అధికారంతో పాటు, తన హయాంలో దోచేసిన ప్రజల సొమ్ము అంతా కలిపితే దాదాపు రూ.3 లక్షల కోట్లకు పైనే ఉందన్నారు. జగన్ పెద్ద ఆర్థిక ఉగ్రవాది... ధనపిశాచి అని ప్రజలే అంటున్నారన్నారు. రాష్ట్రానికి, భావితరాల భవిష్యత్‌కు నష్టం జరుగుతున్నప్పుడు, ప్రజలు స్పందించకపోతే, దోపిడీదొంగలు, దుర్మార్గులు ఇష్టానుసారం పెట్రేగిపోతారన్నారు.
Ayyanna Patrudu
Vijayasai Reddy
YS Jagan
Telugudesam

More Telugu News