Shejal: బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తారో చూస్తా.. శేజల్ సవాల్.. వీడియో ఇదిగో!
- ఆయనో కామ పిశాచి అంటూ ఆరోపణలు
- ఏడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నానంటూ వివరణ
- తన పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన
కామ పిశాచికి లైసెన్స్ ఇచ్చి మహిళలపైకి పంపించినట్లు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిందని ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ మండిపడ్డారు. దుర్గం చిన్నయ్య తమను లైంగికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తప్పుడు కేసులతో వేధిస్తున్నాడని ఆరిజిన్ డెయిర్ డైరెక్టర్ శేజల్ ఏడు నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంపై ఆమె ఢిల్లీలోనూ పలుమార్లు ధర్నా చేశారు. న్యాయం చేయాలంటూ రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో దుర్గం చిన్నయ్య పేరు ఉండడంపై శేజల్ మండిపడుతున్నారు.
ఓ మీడియా సంస్థతో మాట్లాడిన శేజల్.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లిలో మళ్లీ ఎలా గెలుస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ఆగడాలపై ఇంటింటికీ వెళ్లి వివరిస్తానని స్పష్టం చేశారు. ఆయన చేసిన అక్రమాలు, భూకబ్జాలు, కామ పిశాచిగా వేధింపులకు పాల్పడ్డ వైనాన్ని నియోజకవర్గం మొత్తం చాటిచెబుతానని అన్నారు. ఓ కామ పిశాచి, చీటర్ కు టికెట్ ఇచ్చి ఇక నువ్వు రెచ్చిపో, నియోజకవర్గంలో నీకు అడ్డులేదు.. ఇష్టమొచ్చిన అమ్మాయిని వేధించు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వ్యవహరించిందని శేజల్ మండిపడ్డారు.
బాధిత మహిళలకు న్యాయం చేయకుండా, బాధితులను పిలిపించి ఏం జరిగిందని తెలుసుకోకుండా ఆ చీటర్ కు, కామ పిశాచికి సీటు ఎలా ఇచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ పెద్దలను శేజల్ నిలదీశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితులు చాలామంది ఉన్నారని, ఇంకెంత మందిని బాధితులను తయారుచేస్తారని ఆమె ప్రశ్నించారు.