Nara Lokesh: నా మీటింగ్ లో కూర్చున్న వ్యక్తిని తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఇచ్చారు: నారా లోకేశ్

Nara Lokesh held meeting with BC communities representatives

  • గన్నవరం నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నిడమానూరు క్యాంప్ సైట్ లో బీసీలతో ముఖాముఖి
  • చేతివృత్తిదారుల ప్రదర్శనను తిలకించిన లోకేశ్
  • హెచ్ సీఎల్ కంపెనీ వద్ద సెల్ఫీ ఛాలెంజ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు గన్నవరంలో జనం బ్రహ్మరథం పట్టారు. 190వ రోజు గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర గూడవల్లి సెంటర్, కేసరపల్లి, గన్నవరం ఎయిర్ పోర్టు, గన్నవరం చెరువు, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా చినఅవుటపల్లిలోని విడిది కేంద్రానికి చేరుకుంది. 

యువనేత వెంట నూతనంగా పార్టీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావుతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేతలు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, పంచుమర్తి అనూరాధ, బొండా ఉమ తదితరులు ఉన్నారు. 

అంతకుముందు, నిడమానూరు శివారు క్యాంప్ సైట్ లో బీసీ సామాజికవర్గ ప్రతినిధులతో యువనేత లోకేశ్ ముఖాముఖి సమావేశమయ్యారు. 

బీసీలతో ముఖాముఖిలో లోకేశ్ వ్యాఖ్యల హైలైట్స్...

అందుకే జగన్ కు భయం!

జగన్ బీసీల గురించి మాట్లాడుతున్నాడు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీనే. చిత్తూరు జిల్లాలో నా మీటింగ్ లో కూర్చున్న వ్యక్తిని తీసుకెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చాడు. టీడీపీ బీసీల వేదిక, అందుకే జగన్ కి భయం. 

జగన్ రజక సోదరులకు ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశాడు. టీడీపీ హామీ ఇవ్వక పోయినా దువ్వారపు రామారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం చేసింది. వైసీపీ వాళ్లు దోబీ ఘాట్లను కూడా కబ్జా చేస్తున్నారు. టీడీపీ హయాంలో దోబి ఘాట్లు అభివృద్ది చేశాం.

మేం ఆ తప్పు చేయం

బీసీలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది, కీలకమైన పదవులు, శాఖలు  ఇచ్చింది టీడీపీ. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు, జనతా వస్త్రాలు, ఆదరణ పథకం పెట్టింది టీడీపీ. జగన్ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చే నిధులు బీసీల ఖాతాలో రాస్తున్నాడు. మేము ఆ తప్పు చెయ్యం.

బీసీలను పేదరికం నుండి బయటకు తీసుకొచ్చే విధంగా సబ్సిడీ రుణాలు ఇస్తాం. టీడీపీ హయాంలో కుల వృత్తులను కాపాడటానికి ఆదరణ పథకం అమలు చేశాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం. 

జగన్ వచ్చాడు... పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే ఇచ్చాడు!

జగన్ అధికారంలోకి వచ్చాక కీలక పదవులు అన్ని ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు. బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బీసీలపై 26 వేల తప్పుడు కేసులు బనాయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

జగన్ పాలనలో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రద్దు చేశాడు. టీడీపీ హయాంలో అన్ని కీలక పదవులు బీసీలకు ఇచ్చాం. ఒక్కసారి బీసీలు అంతా ఆలోచించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదరణ పథకం తీసుకొస్తాం. కుల వృత్తులు కాపాడటమే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ, అధునాతన పనిముట్లు అందజేస్తాం.

మేం వచ్చాక నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం

దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశాడు. అలాగే ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారిని కూడా రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేశాడు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం తలనీలాలపై వచ్చే ఆదాయంలో పది శాతం నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తాం. 

జగన్ పాలనలో గీత కార్మికులు సంక్షోభంలో ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రన్న బీమా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తాం. నీరా కేఫ్ లు ప్రారంభిస్తాం. లిక్కర్ షాపుల్లో వాటా కల్పిస్తాం.

చేతివృత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన లోకేశ్

నిడమానూరు శివారు క్యాంప్ సైట్ లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సందర్భంగా వివిధ చేతివృత్తిదారులు తాము తయారుచేసే వస్తువుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కుల వృత్తుల వారీగా ఉత్పత్తులను ఆసక్తిగా తిలకించిన లోకేశ్, వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. 

రజక, నూర్ బాషా - దూదేకుల, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, ఎం. బి. సి, మహేంద్ర, యాదవ, మత్స్యకార, ముదిరాజ్, వడ్డెర, విశ్వ బ్రాహ్మణ, సగర, కలంకారీ, చేనేత కుల వృత్తుల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్ దగ్గరా ఆగి వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్న లోకేశ్... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చెయ్యాల్సిన సంక్షేమ కార్యక్రమాల గురించి కులవృత్తిదారుల అభిప్రాయాలను తీసుకున్నారు.

హెచ్ సీఎల్ కంపెనీ వద్ద లోకేశ్  సెల్ఫీ ఛాలెంజ్

ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్న నారా లోకేశ్ హెచ్ సీఎల్ కంపెనీ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు. "ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటీ మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సీఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది. 

జగన్ మాదిరి మేం చదువుకున్న యువతతో చేపల దుకాణాలు, మటన్ మార్టులు పెట్టించలేదు, గంజాయి బానిసలుగా మార్చి మత్తులో ముంచలేదు. రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం పక్క రాష్ట్రాలకు తరిమేయలేదు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబుగారైతే, అరాచకానికి, విధ్వంసానికి కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి!"  అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2539.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.7 కి.మీ.*

*191వరోజు (22-8-2023) యువగళం వివరాలు*

*గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణాజిల్లా)*

సాయంత్రం

3.30 – చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.00 – అవుటపల్లిలో బహిరంగసభలో లోకేశ్ ప్రసంగం.

7.30 – చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు వద్ద విడిది కేంద్రంలో బస.

******

More Telugu News