Bengaluru: బెంగళూరు టెక్కీ రూ.2.7 లక్షల లోన్ తీసుకున్నాడు... తన కోసం కాదు!
- బెంగళూరులో రోడ్లపై గుంతలు
- గాయాల పాలవుతున్న వాహనదారులు
- తన గ్రూప్ తో కలిసి నిధులు సేకరించిన ఓ టెక్కీ
- ఆ డబ్బుతో గుంతలు పూడ్చిన వైనం
- డబ్బు అయిపోవడంతో సొంతంగా లోన్ తీసుకున్న టెక్కీ
మన దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రోడ్లు ఇప్పటికీ అధ్వాన స్థితిలో ఉండడం మీడియాలో చూస్తుంటాం. బెంగళూరు నగరం కూడా అందుకు మినహాయింపు కాదు. రోడ్లపై గుంతలను చూసి విసుగెత్తిపోయిన ఓ టెక్కీ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. రూ.2.7 లక్షల లోన్ తీసుకుని, ఆ డబ్బుతో తానే రోడ్లపై గుంతలను పూడ్చడం మొదలుపెట్టాడు.
అతడి పేరు ఆరిఫ్ ముద్గల్. ఆరిఫ్ కొన్ని రోజుల కిందట గుంతలమయమైన హోసా రోడ్డుపై రెండు యాక్సిడెంట్లు జరగడం చూశాడు. తన అపార్ట్ మెంట్ కు దగ్గర్లో నివసించే ఓ మహిళ గుంతల రోడ్డుపై ప్రయాణిస్తూ గాయాలపాలవడం అతడిని ఆలోచింపజేసింది. హోసా రోడ్డులోని అదే గుంతను తప్పించబోయి ఓ డెలివరీ ఏజెంటు గాయపడడం కూడా ఆరిఫ్ కంటబడింది.
32 ఏళ్ల ఆరిఫ్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. తనలాగే సమాజం కోసం ఆలోచించేవాళ్లతో కలిసి సిటిజెన్స్ గ్రూప్-ఈస్ట్ బెంగళూరు అనే సంస్థను ఐదేళ్ల కిందట స్థాపించాడు. ఇప్పుడు తన సంస్థతో కలిసి నిధులు సమీకరించిన ఆరిఫ్ బెంగళూరులోని హలనాయకనహళ్లి, మునేశ్వర లే అవుట్, చూడసంద్ర రోడ్లపై కొన్ని గుంతలను పూడ్చాడు. ఆ డబ్బు అయిపోవడంతో, సొంతంగా రూ.2.7 లక్షల లోన్ తీసుకువచ్చాడు.
కాగా, ఈ గ్రూప్ లో ఓ సభ్యుడైన మిథిలేశ్ కుమార్ మీడియాతో మాట్లాడాడు. రోడ్లపై గుంతల విషయంలో తాము కొందరు ప్రజాప్రతినిధులను కలిశామని, వారి స్పందన ఆశించిన స్థాయిలో లేదని తెలిపాడు. ఈ ప్రాంతంలో నివసించేవారంతా పరాయి రాష్ట్రాల నుంచి వచ్చిన వారన్న భావన వారి మాటల్లో వ్యక్తమైందని పేర్కొన్నాడు. దాంతో, తాము ఆస్తి పన్ను చెల్లించవద్దంటూ ప్రచారం చేపట్టామని వెల్లడించాడు.
దీనిపై ఎక్స్ (గతంలో ట్విట్టర్)లోనూ ఈ గ్రూప్ ప్రచారం చేపట్టింది. నో డెవలప్ మెంట్ నో ట్యాక్స్ అంటూ నెటిజన్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది.