Yarlagadda Venkatarao: నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన యార్లగడ్డ వెంకట్రావు
- ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ
- కొన్నిరోజుల కిందట చంద్రబాబుతో భేటీ
- ఇవాళ నిడమానూరులో లోకేశ్ తో సమావేశం
- పసుపు కండువా కప్పి యార్లగడ్డను పార్టీలోకి ఆహ్వానించిన లోకేశ్
ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ పసుపు కండువా కప్పి యార్లగడ్డను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు ఇరువురి మధ్య సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, పంచుమర్తి అనురాధ, వంగవీటి రాధా తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో చేరిన యార్లగడ్డకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నారు. ఆయన కొంతకాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... గత ఎన్నికల్లో గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పుడాయన వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనపై గెలిచింది టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ.
ఇప్పుడదే వంశీ వైసీపీకి దగ్గర కాగా, యార్లగడ్డ తెలుగుదేశం పక్షాన చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ యార్లగడ్డ, వంశీ మధ్య పోరు ఉండే అవకాశాలున్నాయి. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన యార్లగడ్డ... చంద్రబాబు చెబితే ఎక్కడ్నించైనా పోటీకి సిద్ధం అంటూ సమర సన్నద్ధతను చాటారు.