Spain: ఒక్క గోల్ తో... ఫిఫా మహిళల వరల్డ్ కప్ విజేతగా అవతరించిన స్పెయిన్

Spain beat England to lift maiden FIFA Women World Cup

  • ముగిసిన ఫిఫా మహిళల ఫుట్ బాల్ వరల్డ్ కప్
  • సిడ్నీలో నేడు ఫైనల్
  • 1-0తో ఇంగ్లండ్ ను ఓడించిన స్పెయిన్
  • గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించిన స్పెయిన్ కెప్టెన్ కార్మోనా
  • ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో తొలి టైటిల్ అందుకున్న స్పెయిన్ అమ్మాయిలు

ఫిఫా మహిళల ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో స్పెయిన్ జట్టు టైటిల్ ఎగరేసుకెళ్లింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఇవాళ జరిగిన ఫైనల్లో స్పెయిన్ ఒక్క గోల్ తో ఇంగ్లండ్ ను ఓడించింది. మ్యాచ్ ముగిసే సమయానికి స్పెయిన్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆ ఒక్క గోల్ కూడా ప్రథమార్థంలో స్పెయిన్ కెప్టెన్ ఓల్గా కార్మోనా సాధించింది. 

ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు ఇంగ్లండ్ అమ్మాయిలు తీవ్రంగా శ్రమించారు. స్పెయిన్ గోల్ పోస్టుపై పదేపదే దాడులు నిర్వహించారు. కానీ ఇంగ్లండ్ ప్రయత్నాలు ఫలించలేదు. ద్వితీయార్థంలో అయితే అటు స్పెయిన్, ఇటు ఇంగ్లండ్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. 

కాగా, ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో స్పెయిన్ కు ఇది తొలి టైటిల్. ఫిఫా మహిళల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధికంగా అమెరికా జట్టు 4 పర్యాయాలు విజేతగా నిలిచింది. పురుషుల సాకర్ లో ఎక్కడో ఉండే అమెరికా... మహిళల సాకర్ లో అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. 

ఈ ఏడాది ఫిఫా మహిళల వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ టోర్నీలో మొత్తం 32 జట్లు పాల్గొన్నాయి. స్వీడన్, ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు సెమీస్ లోనే వెనుదిరిగాయి. వర్గీకరణ మ్యాచ్ లో నెగ్గిన స్వీడన్ కు 3వ స్థానం లభించగా, ఆస్ట్రేలియాకు 4వ స్థానం దక్కింది. 

విజేతగా నిలిచిన స్పెయిన్ అమ్మాయిల జట్టుకు రూ.35 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. రన్నరప్ గా సరిపెట్టుకున్న ఇంగ్లండ్ రూ.25 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది.

  • Loading...

More Telugu News