Lovers: అడవిలో ఆత్మహత్య... మైనర్ ప్రేమ జంట విషాదాంతం
- తిరుపతి జిల్లాలో ఘటన
- కొంతకాలంగా ప్రేమించుకుంటున్న కల్యాణి, యుగంధర్
- అడవిలో చెట్టుకు వేళ్లాడుతూ కనిపించిన మృతదేహాలు
- పెళ్లి చేసుకుని ఉరేసుకున్నట్టు గుర్తించిన పోలీసులు!
ఏది నిజమైన ప్రేమో, ఏది వ్యామోహమో తెలియని వయసులో కొందరు టీనేజర్లు కన్నవారికి గుండెకోత మిగుల్చుతున్నారు. ప్రేమించుకున్న ఇద్దరు మైనర్లు తాజాగా అడవిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లా భాకరాపేటలో జరిగింది.
చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్, రామసముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన కల్యాణి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
అయితే, ఇవాళ భాకరాపేట అటవీప్రాంతంలో పశువుల కాపరులకు చెట్టుకు వేళ్లాడుతూ రెండు మృతదేహాలు కనిపించాయి. భయాందోళనలకు గురైన ఆ పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాలు ఎవరివి అని విచారణ జరపగా, యుగంధర్, కల్యాణిలవని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆ మైనర్ ప్రేమికులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది తెలియరాలేదు. కాగా, ఘటన స్థలంలో ఆనవాళ్లను పరిశీలించిన అనంతరం, ఆ మైనర్లు పెళ్లి చేసుకుని, ఆపై ఉరేసుకున్నట్టు గుర్తించారు. ఈ ఘటనతో ఇరువురి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.