Volodymyr Zelensky: రష్యా దాడిలో ఏడుగురి మృతి... తామిచ్చే జవాబు అదే స్థాయిలో ఉంటుందన్న జెలెన్ స్కీ
- కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభం
- ఉక్రెయిన్ లోని చెర్నిహైవ్ ప్రాంతంపై రష్యా క్షిపణి దాడులు
- మృతుల్లో ఆరేళ్ల బాలిక కూడా ఉందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
- తమ బలగాలు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాయని వెల్లడి
రష్యా, ఉక్రెయిన్ మధ్య సైనిక దాడుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ లోని చెర్నిహైవ్ ప్రాంతంపై రష్యా భీకర క్షిపణి దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు.
దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా క్షిపణి దాడికి తమ బలగాలు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాయని భావిస్తున్నానని జెలెన్ స్కీ తెలిపారు. తామిచ్చే జవాబు రష్యా దాడులకు తగిన స్థాయిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. స్వీడన్ లో పర్యటించిన సందర్భంగా జెలెన్ స్కీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
రష్యా దాడిలో మరణించినవారిలో సోఫియా అనే ఆరేళ్ల పాప కూడా ఉందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 15 మంది చిన్నారులకు ఈ దాడుల్లో గాయాలయ్యాయని తెలిపారు.